Sunday, December 22, 2024

మణిపూర్ ఎందుకు మండుతోంది?

- Advertisement -
- Advertisement -

మణిపూర్ మండుతోంది. అయితే అగ్గిరాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు ? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డ్ తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా?. వీళ్ళు మణిపూరి లేదా మెయితీ బ్రాహ్మణులు. బెంగాల్, మిథిల, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుండి బ్రాహ్మణులు 15వ శతాబ్దంలో మణిపూర్‌కు వలస వెళ్ళడం ప్రారంభమైంది. బహుశా బెంగాల్‌లో ముస్లింల పాలన ప్రారంభం కావడం దీనికి కారణమై వుండవచ్చు. వీళ్ళది వైష్ణవ సంప్రదాయం. వలస వెళ్ళిన చోట మణిపూరి భాష నేర్చుకున్నారు. స్థానిక సంప్రదాయాలను, తమ సంప్రదాయాలను మిళితం చేసి వీళ్ళు బ్రాహ్మణ సంస్కృతిని ప్రారంభించారు. స్వతసిద్ధంగా మెయితీల మతం ఆదివాసీ మతం. బహు దేవతా రాధన వున్నది. సానామహి అనే ఆరాధనా తత్వం వాళ్ళది. మైయితీలందరూ నీటి వనరులున్న భూభాగంలో వరి సాగు వృత్తిగా చేపట్టారు. గుర్రాలను పెంచుతారు. వీళ్ళలో ప్రధానంగా హిందువులు, చెప్పుకోదగ్గ సంఖ్యలో ముస్లింలు వున్నారు. వాళ్ళ జీవితం ఉన్నతమైనది.

మణిపూరి మాతృభాషగా కలిగిన ప్రజలు లోయ ప్రాంతపు జనాభాలో 85 నుండి 90 శాతం. వాళ్ళు ప్రధానంగా పశ్చిమ ఇంఫాల్, తూర్పు ఇంఫాల్, బిష్ణుపురా, హౌబాల్ అనే జిల్లాల్లో నివసిస్తారు. మరో పక్క కొండ ప్రాంతాలైన సేనాపతి, చురా చాంద్‌పూర్, చందేల్, ఉక్రుల్, తామేగ్లాంగ్ అనే ప్రాంతాల్లో మణిపూరి మాట్లాడే వాళ్ళు 4% మాత్రమే. కొండ ప్రాంతాల్లో 89 నుండి 96 శాతం క్రైస్తవులు కాగా, లోయలో 75 శాతం మంది హిందువులు. తూర్పు ఇంఫాల్, హౌబాల్ జిల్లాల్లో గణనీయమైన ముస్లిం జనాభా వుంది. మెయితీలను ఎస్‌టి జాబితాలో చేర్చితే రిజర్వేషన్లలో సింహభాగం వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వరంగ ఉద్యోగాలలో కొండ జాతి ప్రజల కంటే మెయితీలు ఎక్కువ అవకాశాలు పొంది వున్నారు. జనాభాలో 43 శాతంగావున్న కొండ జాతి ప్రజలకి 35 శాతం ఉద్యోగాలు, లోయప్రాంతం వాళ్ళకి 65 శాతం ఉద్యోగాలున్నాయి. అవన్నీ క్రమం గా మెయితీల చేతుల్లోకి వెళ్ళిపోతాయని వాళ్ళ ఆవేదన. ఇందు లో భూ యాజమాన్య సమస్య కూడా వుంది. మెయితీలను కూడా ఎస్‌టిలుగా మారిస్తే కొండ ప్రాంతాలలో వుండే సాంప్రదాయక భూయాజమాన్యంలో మార్పులు వస్తాయని కొండ ప్రాంతాల ఆదివాసీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు.

మణిపూర్‌లోని గ్రామాల సంఖ్య పెరుగుదల, తరుగుదల పైన కూడా వివాదం వున్నది. ఉదాహరణకు ఇంఫాల్ లోయలో 1969 లో 587 గ్రామాలుండేవి. వాటన్నింటిలోనూ ఆధిపత్యం మెయితీలదే. 2021 నాటికి ఈ సంఖ్య 544కు తగ్గిపోయింది. అదే సమయంలో కొండ ప్రాంతాల్లో 1969లో 1370 గ్రామాలుండేవి. 2021 నాటికి అవి 2244కు పెరిగాయి. ఈ గ్రామాల్లో వుండే ప్రజలందరూ కుకీలు, నాగాలు వంటి 34 షెడ్యూల్డ్డ్ తెగలకు చెందినవాళ్ళు. అయితే కొండ ప్రాంతాల్లో గ్రామాలు పెరగడానికి అక్రమ చొరబాటుదారుల ప్రవేశమే కారణమని భారత ప్రభుత్వం వాదన. అయితే అది వాస్తవం కాదంటున్నారు స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ దినాగాంగ్లూంగ్ గంగ్‌మెయి. కుకీలలో ఒక సంప్రదాయం వున్నది. తెగ పెరిగిన కొద్దీ చుట్టు పక్కల ప్రాంతాలలో కొత్త గ్రామాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చే సాంప్రదాయం. అదే ఈ పెరుగుదలకు కారణం, కాని అక్రమ వలసదారులు కాదని ఆయన అభిప్రాయం.మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తరవాత అక్కడ నుండి వలసలు మణిపూర్‌లోకి వచ్చిన మాట వాస్తవమేగాని వాళ్ళ సంఖ్య వందల్లో మాత్రమే వుందని ఆయన అంటున్నారు.

మణిపూర్ లోయ ప్రాంతాలలో గ్రామాల సంఖ్య తగ్గడానికి కారణం అక్కడ అభివృద్ధి జరిగి పట్టణీకరణ పెరగడం. వాళ్ళు తాము నాగరికులమని, తమ ఆచార సంప్రదాయాలు మిగిలిన తెగల కంటే భిన్నమైనవనీ ఒక ఆధిక్యతా భావాన్ని ఎప్పుడూ ప్రదర్శించే వాళ్ళు. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా తమను ఎస్‌టిలుగా గుర్తించాలని ఎందుకు కోరుకుంటున్నారో మిగిలిన ప్రజలకు అర్థం కాలేదు.
ఎందుకంటే మణిపూర్ భూభాగంలోని సారవంతమైన భూములన్నీ మెయితీలు నివసించే లోయలోనే వున్నాయి. అక్కడ వ్యవసాయమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ టూరిజం ద్వారా కూడా విపరీతమైన ఆదాయం వస్తుంది. పైగా వాళ్ళందరూ హిందువులు. కొద్ది మంది ముస్లింలు కూడా వున్నారు. అయితే కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అత్యధిక శాతం క్రైస్తవులు. రాజకీయాధికారాన్ని పంచుకునే విషయంలో కూడా ఈ తారతమ్యం వున్నది. 60 మంది శాసన సభ్యులున్న మణిపూర్‌లో 40 స్థానాలు లోయలోనూ, 20 స్థానాలు కొండ ప్రాంతంలో వున్నా యి. ఆ 40 స్థానాల్లోనూ నిరంతరం మెయితీలే గెలిచేవారు. కాబట్టి సహజంగానే రాజకీయాధికారం వాళ్ళదే.

ఇప్పుడు మెయితీలకు ఎస్‌టి జాబితాలో చేరే అవకాశం కల్పిస్తే భూమి మీద తమకున్న సంప్రదాయక యాజమాన్యానికి దెబ్బ తగులుతుందని నాగాలు, కుకీలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాలపై ఆదివాసీలకే హక్కు వుండాలని ప్రభుత్వం చట్టం చేసినా దానికి ఆచరణలో ఎంతగా తూట్లు పడుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అటవీ సంపదను కాపాడే నెపంతో, చట్ట వ్యతిరేకంగా అడవుల్లో చేరుతున్న వలసదారులను ఏరిపారేయడం అనే కారణంగా ప్రభుత్వం అక్కడ నుండి పెద్ద ఎత్తున గ్రామాలను ఖాళీ చేయించడం ప్రారంభించింది. ఇది వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టటమే. ఇలాంటి పరిస్థితులలో మెయితీలను కూడా ఎస్‌టిలుగా ప్రకటిస్తే వాళ్ళు చట్టబద్ధంగానే తమ కొండ ప్రాంతాలకు వచ్చి తమ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటారనే భయం నాగాలది, కుకీలది. ఇది అవాస్తవికమైన భయం అనడానికి అవకాశం లేదు. దేశంలో అనేక చోట్ల ఇదే జరుగుతోంది.
ఈ కారణాలన్నింటితో పాటు మరొక ముఖ్యకారణం కేంద్రంలో, రాష్ట్రంలో వున్న బిజెపి ప్రభుత్వాలు ఆదివాసీల హైందవీకరణను పెద్ద ఎత్తున పథకం ప్రకారం ప్రోత్సహించడానికి ప్రయత్నించడం. దానిలో భాగంగానే లోయలో వున్న హిందూ మెయితీలు, కొండ ప్రాంతాల్లో వున్న క్రైస్తవులైన నాగా, కుకీల మధ్య అధిగమించడానికి వీలులేని విభజన రేఖను సృష్టించారు.

మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలో చాలా పెద్ద సంఖ్యలో చర్చీలు దాడులకు గురయ్యాయి. మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భక్తచరణ్ దాస్ అభిప్రాయాంలో ఈ చర్చీల విధ్వంసానికి కారణం ఆరంబాయి టెనెగోల్ అనే సంస్థ. ఇది భజరంగదళ్ లాంటిది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఆశీస్సులు దీనికున్నాయి. ఇలాంటిదే మరొక సంస్థ మెయితీ లీపున్ ఈ చర్చీల విధ్వంసానికి, పోలీసుల క్యాంపుల నుండి తుపాకులు ఎత్తుకు పోవడానికి ఈ రెండు సంస్థలే కారణం. వీళ్ళలో మత విద్వేషం ఎంతగా పెరిగిందంటే వాళ్ళు మెయితీల చర్చీలను కూడా ధ్వంసం చేశారు. అలానే కొన్ని చోట్ల హిందూ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20 వేల మంది ఇళ్ళు వదిలి శరణార్థుల శిబిరాలలో తలదాచుకుంటున్నారు. కేంద్రం 355వ నిబంధనను ప్రయోగించి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. ప్రభుత్వాలు సున్నితత్వానికి దూరమై చాలా సంవత్సరాలైంది.

సమస్యల పట్ల మానవీయ స్పందన వాటిలో కనపడడం లేదు. మతాల మధ్య, కులాల మధ్య, తెగల మధ్య, మొత్తంగా ప్రజా సమూహాల మధ్య మానసిక ఐక్యతను సాధించే విషయంలో ప్రస్తుత పాలకులకి ఎలాంటి ఆసక్తి లేదు. సామ్రాజ్యవాదులు పాటించిన విభజించి పాలించు సూత్రాన్నే బిజెపి ప్రభుత్వం అమలు పరుస్తోంది. మరో వైపు దేశంలోని ఆదివాసీ ప్రజా సమూహాలను హైందవీకరించడం వేగాన్ని పుంజుకుంది. ఈ మధ్యకాలంలోనే అఖిల భారతస్థాయిలో బంజారాలు, లంబాడీల సమ్మేళనాల్ని సంఘ్ పరివార్ ఆధ్యర్వంలో నిర్వహించడం కూడా ఇందులో భాగమే.ఒకవైపు మతం మారిన హిందువులను ఘర్ వాపసీ పేరుతో వెనక్కు రమ్మని ప్రోత్సహిస్తూ, మరో పక్క ఆదివాసీ ప్రజల దేవుళ్ళను, దేవతలను సంప్రదాయాలను హైందవీకరించడం ఇలాంటి విస్పోటనాలకి కారణం.రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరిగే ప్రమాదం వున్నది. పాలక వర్గాలు ఆదివాసీలను కూడా తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా చిచ్చుపెట్టి అడవుల్లో విద్వేషపు మంటలు రగిలిస్తున్నాయి.

మారుపాక అనిల్ కుమార్
9440482429

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News