Monday, December 23, 2024

మణిపూర్ చల్లారదా?

- Advertisement -
- Advertisement -

ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే ఆందోళనకరం ఏముంటుంది? తాజాగా మొన్న బుధవారం రాత్రి మొదలై గురువారం ఉదయం వరకు అనేక జిల్లాల్లో హింస చెలరేగింది. బుధవారం ఉదయం టెంగ్నౌపాల్‌లో సాయుధ మిలిటెంట్ల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించిన ఘటన ఈ హింసకు దారి తీసింది. గురువారం మధ్యాహ్నం బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు మెయితీ రైతులను సాయుధ దుండగులు హతమార్చారు. వారు పొలం దున్నుతుండగా దాడి చేసి ఈ దురాగతానికి ఒడిగట్టారు. గురువారం నాటి ఉదయమే ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో తలెత్తిన సాయుధ ఘర్షణలో 23 ఏళ్ల మెయితీ హతుడయ్యాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి భద్రతా దళాలకు కష్టతరమైంది.

అనేక జిల్లాల్లో ఒకేసారి హింస చెలరేగడం అతి పెద్ద సవాలుగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన జనం భద్రతా దళాల మీద సైతం దాడులకు తెగిస్తున్నారు. రెండు తెగల్లోనూ మిలిటెంటు ముఠాలు ఏర్పడి హింసాత్మక దాడులకు పాల్పడుతున్నాయి. బుధవారం నాడు సంభవించిన అటువంటి ఒక దాడిలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఇదంతా రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. కేంద్రంలో, మణిపూర్‌లో గల డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏమీ చేయలేక చతికిలబడిపోయిన తీరు స్పష్టంగా కనిపిస్తున్నది. పర్యవసానంగా తీవ్రమైన ప్రాణ హాని, విధ్వంసం సంభవిస్తున్నాయి. కలిసి జీవించవలసిన రెండు జాతుల మధ్య వైషమ్యాలు పెరుగుతూ పోతున్నాయి. గత ఏడాది మే 23 నుంచి మెజారిటీ మెయితీలకు, గిరిజన కుకీ తెగవారికి మధ్య చెలరేగుతున్న ఘర్షణల్లో ఇంత వరకు 207 మంది దుర్మరణం పాలయ్యారు. 50 వేల మందికి పైగా స్వస్థలాలకు దూరమయ్యారు. చాలా మంది శిబిరాల్లో తల దాచుకొంటున్నారు.

ఇంఫాల్ లోయలో మైదాన ప్రాంతంలో నివసించే మెజారిటీ మెయితీలను గిరిజనులుగా (ఎస్‌టి లుగా) గుర్తించాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేయాలని, మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో అందుకు నిరసనగా గత ఏడాది మే 3న మణిపూర్ అఖిల గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోను ప్రదర్శనలు, ఊరేగింపులు చేపట్టారు. అందులో హింస చోటు చేసుకోడంతో ఆ మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాజ్యాంగం 355వ అధికరణను అమల్లోకి తెచ్చింది. కల్లోల సమయంలో రాష్ట్రాన్ని కాపాడడానికి ఈ అధికరణ కేంద్రానికి ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. పలు రకాల సైన్యం, భద్రతా దళాలు మణిపూర్‌కి చేరుకోడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొన్నది. హైకోర్టు ఆదేశాలతో మెయితీలు ఎస్‌టిలుగా గుర్తింపు పొందితే తాము అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు పలచబడి వాటికి దూరమవుతామనే భయం కుకీ జో, నాగా తదితర గిరిజన తెగల్లో చోటు చేసుకొన్నది.

తమకు లభించబోతున్న ఎస్‌టి హోదాను అడ్డుకొంటున్నారని భావించిన మెయితీలు కుకీలపై ద్వేషం పెంచుకొన్నారు. ఘర్షణలు పెరిగాయి. మెయితీ తెగకు చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అడవులపై గిరిజన తెగలకున్న హక్కులను హరిస్తున్నాడని కుకీలు భావిస్తున్నారు. గత జులైలో బయటపడిన ఒక సామూహిక అత్యాచారం, హత్యల వీడియో జాతుల కలహాగ్ని మీద ఆజ్యంలా పని చేసింది. మెయితీల దాడుల నుండి కాపాడుకోడానికి ఇళ్లు వీడి పారిపోతున్న కుకీ మహిళలు ముగ్గురిని పోలీసులే పట్టుకొని మెయితీ దుండగులకు అప్పగించగా అడ్డుకొన్న ఇద్దరు పురుషులను వారు హతమార్చి మహిళలపై సామూహిక హత్యాచారానికి పాల్పడినట్టు చూపించిన ఆ వీడియో ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది. మెయితీలు హిందువులు, కుకీలు క్రైస్తవులు కావడం గమనించవలసిన విషయం. ఈ దారుణంపై పార్లమెంటులో ప్రకటన చేయాలన్న ప్రతిపక్ష డిమాండును ప్రధాని మోడీ పట్టించుకోలేదు.

కుకీల భయాలకు కారకుడైన బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలన్న విజ్ఞప్తినీ తోసిపుచ్చారు. సమర్థుడైన ముఖ్యమంత్రి అని కితాబు ఇచ్చారు. మణిపూర్ మంటలను ఆర్పే పని మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికీ అనేక సార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. శిబిరాల్లోని రెండు వర్గాల వారిని కలిసి త్వరలో మామూలు పరిస్థితిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాని తాజా సంఘటనలు అక్కడ వాతావరణం మరింతగా కలుషితమైనట్టు చాటుతున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికల లోపు అయినా మణిపూర్ చల్లారే సంకేతాలు కనబడడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News