Saturday, September 21, 2024

మణిపూర్‌లో చల్లారని మంటలు

- Advertisement -
- Advertisement -

ఇలా ఎంత కాలం? మా చదువులు సాగేదెలా? మా భవిష్యత్తు ఏమైపోవాలి? అంటూ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో వేలాది విద్యార్థులు తాజాగా రోడ్లపైకి వచ్చి చేసిన ప్రదర్శన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనాన్ని, సమస్య పరిష్కారంలో వారి నాన్పుడు ధోరణిని కళ్లకు కడుతోంది. గత పదిహేను నెలలుగా మణిపూర్‌లో హింసాగ్ని రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. కుకీ, మైతేయి తెగల మధ్య చెలరేగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య మూడు వందలకు పైమాటే. దాదాపు 70 వేల మంది ఇల్లూవాకిలీ వదిలి, శరణార్థి శిబిరాలలో మగ్గుతున్నారు.

ఇక మిగిలిన జనమంతా ఎప్పుడేం జరుగుతుందో, ఏ క్షణంలో ప్రత్యర్థి తెగకు చెందినవారు దాడి చేసి ప్రాణాలు తీస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. గత పది రోజులుగా హింసాకాండ తారస్థాయికి చేరింది. మయన్మార్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జిరిబామ్ జిల్లాలో కుకీ సాయుధులు అత్యంత అధునాతన ఆయుధాలతో దాడులకు దిగుతున్నారు. గత పది రోజులుగా ఇరువర్గాలకు మధ్య జరుగుతున్న దాడులకు తొమ్మిది మంది బలయ్యారు. ప్రత్యర్థులపై తెగబడేందుకు దుండగులు డ్రోన్లు, రాకెట్లను వాడుతున్నారంటే అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కుకీలు దీర్ఘశ్రేణి రాకెట్లను సైతం వినియోగిస్తున్నారన్న వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి.

ఇంతటి ప్రమాదకరమైన ఆయుధాలు వారి చేతిలో పడినా, మణిపూర్‌లో మోహరించి ఉన్న సైన్యం, పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. పోలీసుల నుంచి దోచుకున్న ఐదు వేలకు పైగా ఆయుధాలను ఆందోళనకారులు బహిరంగంగా ప్రదర్శించడం, వీధుల్లో కవాతు చేయడం అక్కడ పరిపాటిగా మారింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న మైతేయిలను ఎస్‌టిల జాబితాలో చేర్చే విషయాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు గత ఏడాది మే నెలలో జారీ చేసిన ఉత్తర్వులతో మణిపూర్ భగ్గుమంది. 36 లక్షల మంది ప్రజలు నివసించే ఈ ఈశాన్య రాష్ట్రం యావత్తు రెండుగా విడిపోయింది. లోయ ప్రాంతాలపై మైతేయిలు, కొండ ప్రాంతాలపై కుకీలు ఆధిపత్యం చెలాయిస్తూ, ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు.

అయినప్పటికీ ఇంతవరకూ కంటితుడుపు చర్యలు మినహా సమస్య శాశ్వత పరిష్కారానికి పాలకులు చేపట్టిన చర్యలు శూన్యం. బిజెపి పాలిత మణిపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారాలను కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ కమాండ్ పర్యవేక్షిస్తోంది. దీనివల్ల తన చేతులు కట్టేసినట్లు అవుతోందని భావిస్తున్న ముఖ్యమంత్రి, తాజాగా అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గవర్నర్‌ను కలసి యూనిఫైడ్ కమాండ్‌ను తనకు అప్పగించాలంటూ విన్నవించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో విఫలమయ్యారనే కారణంగా బీరేన్ సింగ్‌పై బిజెపి అధిష్ఠానం ఇప్పటికే గుర్రుగా ఉంది. పార్టీ ఎంఎల్‌ఎలను వెంటబెట్టుకుని మరీ వెళ్లి గవర్నర్‌ను కలసి యూనిఫైడ్ కమాండ్‌పై అధికారాలు ఇవ్వాలని బీరేన్ కోరడంతో ఇక రాష్ట్రంలో నాయకత్వం మార్పు తప్పదన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే అసలు సమస్యను వదిలిపెట్టి పార్టీలో అంతఃకలహాలపై బిజెపి అధిష్ఠానం దృష్టిసారిస్తోందన్న విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఏడాదిన్నరగా ఘర్షణలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి వహించడం ప్రతిపక్షాల చేతికి అస్త్రంగా మారింది. ఎక్కడ ఏ ఘర్షణ జరిగినా అక్కడకు వెళ్లి బాధితులకు సాంత్వన చేకూర్చే ప్రధాన మంత్రి ఇప్పటి వరకూ మణిపూర్‌ను సందర్శించకపోవడం విపక్షాలకే కాదు, సామాన్యుడి గుండెలను సైతం భగ్గుమనేలా చేస్తోంది.

డబుల్ ఇంజన్ సర్కార్‌గా గొప్పలు చెప్పుకునే బిజెపి పెద్దలు, తమ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే ఏడాదిన్నరగా ఏమీ చేయలేకపోవడం అసమర్థత గాక ఇంకేమిటన్న విమర్శకుల ప్రశ్నకు ఏం జవాబు చెబుతారు? కేంద్ర ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో రంగంలోకి దిగకపోతే మణిపూర్‌లో పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తప్పించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని పెద్దలు ఇకనైనా పరిగణనలోకి తీసుకోవాలి. ఘర్షణలకు ప్రధాన కారణంగా భావిస్తున్న మైతేయి, కుకీ తెగల పెద్దలను, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులను ఒక వేదికపైకి చేర్చి, చర్చలకు శ్రీకారం చుట్టడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం శ్రేయస్కరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News