Friday, December 20, 2024

మణిపూర్‌లో ఆరని మంటలు

- Advertisement -
- Advertisement -

ఏడాదిన్నరగా సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. కుకీ, మెయితీ మిలిటెంట్లు ఒకరిపై ఒకరు పాశవికమైన దాడులకు దిగుతూ, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారు. ఇటీవల సిఆర్‌పిఎఫ్ జవాన్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కుకీలు మరణించడంతో తాజాగా అల్లర్లు భగ్గుమన్నాయి. గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్న కుకీలను సిఆర్‌పిఎఫ్ జవాన్లు పట్టుకుని కాల్చి చంపారని కుకీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెయితీ మిలిటెంట్లు కుకీ వర్గానికి చెందిన ముగ్గురు పిల్లల తల్లిని కాలివేళ్లకు మేకులు కొట్టి, సామూహికంగా మానభంగం చేసి చంపడంతో కుకీలు రగిలిపోయారు. శరణార్థి శిబిరంలో రక్షణ పొందుతున్న మెయితీ వర్గానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని ఎత్తుకువెళ్ళి, వారిలో ఓ వృద్ధురాలినీ, ఓ పసివాణ్నీ అత్యంత దారుణంగా మట్టుబెట్టారు.

రెండేళ్ల ఆ పసివాడి చేతులు, తల నరికి బరాక్ నదిలో మొండాన్ని పడవేశారంటే జాతుల మధ్య వైరం ఎంతటి పతాక స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, అల్లర్లను అణచివేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జబ్బలు చరుచుకోవడం రాజకీయ ప్రయోజనాలను ఆశించే తప్ప వాస్తవంలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మణిపూర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందనీ, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని గతంలోనే సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన అల్లర్లలో ఇంతవరకూ 200 మంది బలి కాగా, సుమారు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధికులు ఇల్లూవాకిలీ వదిలి దూరప్రాంతాలకు తరలిపోగా, మిగిలినవారు ఇప్పటికీ శరణార్థి శిబిరాలలోనే మగ్గుతున్నారు. వారికి కూడా రక్షణ లేదన్న విషయం తాజా దాడులతో వెల్లడైంది.

మణిపూర్ రాష్ట్రం యావత్తు మెయితీ, కుకీ వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారింది. అనేక జిల్లాలలో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పిల్లలు బడులకు, ఉద్యోగస్థులు కార్యాలయాలకూ దూరమై, పడరాని పాట్లు పడుతున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న మణిపూర్ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన రాష్ట్రం. ఇక్కడ శాంతిభద్రతలు దెబ్బతింటే అది జాతీయ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రంలోని బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితులను అదుపులోకి తేవడంలో విఫలమైందనడానికి గత ఏడాదిన్నరగా జరుగుతున్న అల్లర్లు, మారణహోమమే నిదర్శనం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మైతేయి వర్గానికి చెందిన బీరేన్ సింగ్ స్వయంగా కుకీల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటమే ఆశ్చర్యకరం.

బీరేన్ వైఫల్యాన్ని గమనించిన సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడింది. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రులు, ఎంఎల్‌ఎలు రాజీనామా చేయాలంటూ సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాయి. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడల్లా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడమే తప్ప నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేకపోతున్న కేంద్ర హోంశాఖ అల్లర్లను అదుపు చేయడానికి, శాంతి భద్రతలను నెలకొల్పడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాదిన్నరలో ప్రధానమంత్రి ఒక్కసారి కూడా మణిపూర్ రాష్ట్రంలో పర్యటించి, బాధితులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో కుకీ తెగకు చెందిన నాయకులు సుప్రీంకోర్టు గడపతొక్కారు. బీరేన్ వివక్షాపూరిత విధానాలపై సర్వోన్నత న్యాయస్థానమే సిట్‌ను ఏర్పాటు చేయాలని వారు చేసిన విన్నపం సమంజసమైనదే. ప్రభుత్వాలు చేతులు ముడుచుకు కూర్చున్నప్పుడు న్యాయస్థానాల వైపు బాధితులు చూడటంలో తప్పేముంది? కేంద్ర పోలీసు బలగాలు, సైనిక దళాలను నియుక్తం చేసినంతమాత్రాన గాడితప్పిన రాష్ట్రం చక్కబడుతుందని ఆశించడం సరికాదు. హత్యాకాండకు పాల్పడుతున్న కుకీ, మెయితీ తెగలకు చెందిన నాయకులను ఒకచోట కూర్చోబెట్టి చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే మాత్రమే ప్రయోజనం ఉంటుంది. దీనికి నడుం బిగించవలసింది కేంద్ర ప్రభుత్వమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News