Saturday, November 23, 2024

బెంగాల్ హింస!

- Advertisement -
- Advertisement -

Violence in West Bengal Assembly Elections

 

మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడానికి నియమించిన కేంద్ర బలగాల కాల్పుల్లోనే నలుగురు గ్రామస్థులు దుర్మరణం పాలయ్యారు. వార్త వినగానే రక్షకులే భక్షకులయ్యారనే అభిప్రాయం చాలా మందికి కలిగి ఉంటుంది. పరిస్థితి అంతటి తీవ్ర స్థాయికి ఎలా, ఎందుకు చేరుకున్నది, ప్రాణ నష్టం వరకు వెళ్లకుండా కేంద్ర దళాలు తగిన జాగ్రత్తలు ఎందుకు పాటించలేకపోయాయనే ప్రశ్నలు తలెత్తడం సహజం. మూకలు తమను చుట్టుముట్టడంతో ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని వారంటున్నారు. కాని తుపాకులను వివేచనతో ఉపయోగించి ఉంటే ప్రాణ హాని తప్పి ఉండేదేమో, ముట్టడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టడం సులభతరమయ్యేదేమోనని అనిపిస్తోంది.

ఇంత జరిగిన తర్వాత బరిలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ హింసను ఒక్క కంఠంతో ఖండించి ఉండవలసింది. కాని అలా జరగలేదు. అందుకు బదులు ప్రధాన ప్రత్యర్థి పక్షాలైన బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌లు ఈ ఘటనను కూడా పరస్పరం ఎండగట్టుకోడానికే ఉపయోగించుకున్నాయి. పశ్చిమ బెంగాల్ కూచ్‌బెహార్ జిల్లా సీతల్‌కూచి నియోజక వర్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒక పుకారే ఇంత తీవ్ర పరిణామానికి దారి తీసిందని అర్థమవుతున్నది. ఆ రోజు ఉదయం 9.30 గం. వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోడంతో ఉద్రిక్తంగా మారిందని తెలుస్తున్నది. దళాల దాడి వల్లనే ఆ వ్యక్తి కుప్పకూలిపోయినట్టు పుకారు పుట్టడంతో ఆగ్రహించిన 300 మందికి పైగా జనం బలగాలపై విరుచుకుపడ్డారని చెబుతున్నారు. కేంద్ర దళాలకు ఉపయోగపడడానికి స్థానిక పోలీసులను అక్కడ ఎందుకు నియమించలేదో అర్థం కావడం లేదు. గత కొంత కాలంగా అక్కడ బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య, ప్రధాని మోడీ అమిత్ షాలు ఒక వైపు మమతా బెనర్జీ మరో వైపు మోహరించగా సాగుతున్న వాగ్యుద్ధకాండ, మాటల మంటల గురించి తెలిసిందే.

కేంద్ర పెద్దలు దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ కనపరచనంత కసిని బెంగాల్‌లో చూపిస్తున్న సంగతి విదితమే. ఎన్నికల ప్రచార రంగంలో ఇది మరింత వేడిని పుంజుకుంది. హింసకు దారి తీస్తుందని ముందు నుంచి అందరూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వీలైనంత త్వరగా ఎన్నికల ఘట్టం ముగించడానికి బదులు ఎవరూ ఊహించని రీతిలో ఎనిమిది దశలుగా విభజించి జరిపించాలనుకోడంలోనే అసలు లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన ఆలోచనా శక్తిని బొత్తిగా ఉపయోగించలేదనే అభిప్రాయమూ కలుగుతున్నది. దానికి గల కారణాలను వివరించవలసిన పని లేదు. ఇప్పటికి జరిగిన నాలుగు దశలలో 135 నియోజక వర్గాల పోలింగ్ మాత్రమే ముగిసింది. ఇంకా 159 నియోజక వర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యేలోగా ఇంకెంత సునిశితమైన మాటల బాణాల ప్రయోగం జరుగుతుందో, అది ప్రజల మధ్య మరెంత భావావేశాన్ని రగిలించి ఘర్షణ వాతావరణాన్ని ఇంకెంతగా మండిస్తుందో! బెంగాల్‌లో ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ 2019 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా 40.64 ఓట్ల శాతంతో 18 స్థానాలు గెలుచుకొని ఔరా! అనిపించింది. ఆ ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర అధికారాన్ని గెలుచుకోవాలని అది కోరుకోడం తప్పు కాదు.

కాని అందుకు ఆ పార్టీ అనుసరిస్తున్న పద్ధతులే ఆక్షేపణీయంగా ఉన్నాయి. యావత్తు దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రాచరిక స్థాయి యుద్ధంగా పరిగణించి అనునిత్యం ప్రచారంలో పాల్గొంటూ ఉండడం అసాధారణమైన విషయం. అలాగే తొలి విడత పోలింగ్ ముగిసినప్పటి నుంచి గెలుపు తమదేనని, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ బంగాళా ఖాతంలో కలియడం ఖాయమనే రీతిలో బిజెపి పెద్దలు మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించింది. కూచ్‌బెహార్‌లో శనివారం నాడు జరిగిన మాదిరి సంఘటనలు మరిన్ని చోటు చేసుకోనున్నాయని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి అదే పరిస్థితి ఎదురవుతుందని బెంగాల్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన ప్రకటన జుగుప్సాకరంగా ఉంది. కాల్పుల్లో మరణించిన వారి పట్ల సానుభూతి లేకపోగా వారిని దుండగులుగా చిత్రించే దుస్సాహసం ఆయన మాటల్లో ధ్వనించింది. ఒక దురదృష్టకర సంఘటన జరిగిపోయింది. అది మావోయిస్టులకు బలగాలకు మధ్య జరిగే పోరాటం వంటిది కాదు. ఒక వదంతి సృష్టించిన పరిస్థితుల్లో ప్రజలు తిరగబడి ఉండొచ్చు అంత మాత్రాన వారు ప్రజలు కాకుండా పోరు. ఎవరు గెలిచి ఎవరు ఓడినా అసలు పరాజితులు ప్రజలేనన్న కఠోర సత్యం పదేపదే రుజువవుతూ ఉండడం అత్యంత బాధాకరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News