కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడి
జెకె, ఈశాన్యం, నక్సల్ బాధిత ప్రాంతాల ప్రస్తావన
అఖిల భారత పోలీస్ సైన్స్ మహాసభలో అమిత్ షా
గాంధీనగర్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గడచిన పది సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్, ఈశాన్యం, నక్సల్ బాధిత ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలను 70 శాతం మేర తగ్గించగలిగిందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం వెల్లడించారు. గాంధీనగర్‌లో రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయంలో 50వ అఖిల భారత పోలీస్ సైన్స్ మహాసభ (ఎఐపిఎస్‌సి) ప్రారంభ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ, రానున్న దశాబ్దం భారతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైనది, శీఘ్రతరమైనదిగా చేయగలదన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
‘ఏళ్ల తరబడి మూడు ప్రాంతాలు కాశ్మీర్, ఈశాన్యం, నక్సలైట్ బాధిత ప్రాంతాలను అత్యంత కల్లోలితమైనవిగా పరిగణించారు. ఆ మూడు ప్రాంతాల భద్రతలో మేము గణనీయంగా మెరుగుదల తీసుకువచ్చాం. అంతకు ముందు కాలంతో గత పది సంవత్సరాల డేటాను పోలిస్తే హింసాత్మక సంఘటనలను 70 శాతం మేర మేము తగ్గించగలిగినట్లు విదితం అవుతుంది’ అని అమిత్ షా చెప్పారు. ‘ఇది అతి పెద్ద విజయమని భావిస్తాను. దీని (హింసాకాండ) తగ్గింపునకు ప్రభుత్వం చేసిన కృషిని అధిక సంఖ్యాక ప్రజలు హృదయపూర్వకంగా సమర్థించారు’ అని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలోనూ అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే గత పది సంవత్సరాల్లో ఆరింతల మేర డ్రగ్స్ స్వాధీనం జరిగింది’ అని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది మూదు కొత్త క్రిమినల్ చట్టాల అమలు నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీ నుంచి మూడు సంవత్సరాల్లోగానే సుప్రీం కోర్టు స్థాయిలో ప్రజలకు న్యాయం అందజేయడమైందని అమిత్ షా చెప్పారు.
రానున్న పది సంవత్సరాలు భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను అత్యంత ఆధునిక, అత్యంత శాస్త్రీయమైన, శీఘ్రతరమైనదిగా చేయవలసిన సమయం. నేను పుట్టినప్పటి నుంచి కోర్టు నుంచి న్యాయం చాలా ఆలస్యంగా జరుగుతుందనే హేళనలు విన్నా. మూడు నేర చట్టాల అమలు తరువాత దేశంలో ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడు సంవత్సరాల్లోగానే సుప్రీం కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని మీకు హామీ ఇవ్వదలిచాను’ అని అమిత్ షా చెప్పారు. ఒక దశాబ్ది క్రితం నాటి 11వ స్థానం నుంచి ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని ఆయన వెల్లడించారు. 2028 ఏప్రిల్ 1 లోగా భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలదని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. అంతర్గత భద్రత, క్రిమినల్ న్యాయ వ్యవస్థ విషయంలో తమ ప్రభుత్వం తీవ్ర మార్పులు చేసిందని, మార్పులు కఠిన శ్రమ, మెరుగైన సమన్వయం, సమ్మిళితాన్ని కోరుకుంటాయని కేంద్ర మంత్రి చెప్పారు.