Monday, December 23, 2024

బెంగాల్ హుగ్లిలో హింసాకాండ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో ఆదివారం హింసాకాండ చెలరేగింది. రామనవవి వేడుకలలో భాగంగా ఇక్కడ బిజెపి ఆధ్వర్యంలో సాగిన శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లురువ్వారు. దీనితో పరస్పర ఘర్షణలు, పలు చోట్ల వాహనాల దగ్ధం పలువురు గాయపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిజెపి శోభాయాత్రపై కావాలనే దాడికి పాల్పడ్డారని ఓ వైపు ఆ పార్టీ వర్గాలు టిఎంసిపై విమర్శలకు దిగాయి. శాంతిభద్రతల విచ్ఛిన్నానికి బిజెపి కావాలనే ఇటువంటి హింసాత్మక చర్యలకు ఆజ్యం పోస్తోందని అధికార టిఎంసి ఎదురుదాడికి దిగింది. ఈ వారం మొదట్లో రామనవమి ప్రదర్శన దశలో హౌరాలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఇప్పుడిప్పుడే హౌరాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దశలో అక్కడికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని హుగ్లీలో ఇప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది. హుగ్లిలో జరిగిన ప్రదర్శనకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు దిలీప్ ఘోష్ కూడా హాజరయ్యారు.

ఘర్షణలు చోటుచేసుకోవడంతో ప్రజలు పరుగులు తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలకు పాకాయి. హుగ్లిలో జరిగిన ఘటనలపై బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. హింసాకాండకు బాధ్యులను గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారతీని, జైళ్లకు పంపిస్తారని తెలిపారు. ఉద్రిక్త ప్రాంతాలకు వెంటనే అదనపు బలగాలను తరలించారు. ఇటువంటి దౌర్జన్యకర చర్యలను సహించేది లేదు , గూండాయిజాన్ని పూర్తిగా అణిచివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని అధికారపార్టీ ప్రకటనలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా హెచ్చరికలు వెలువరించడం, పరిస్థితిని చక్కదిద్దుతామని తెలియచేయడం కీలక పరిణామాలకు దారితీసింది.

మమత బెనర్జీకి హిందువులంటే ద్వేషమని, అందుకే హుగ్లీలో శాంతియుత బిజెపి శోభాయాత్రపై దాడి చేయించారని బెంగాల్ బిజెపి అధ్యక్షులు సుకంత బెనర్జీ ఆరోపించారు. కాగా బిజెపి ఇతర మతసంస్థలే ఇప్పటి హింసాకాండకు కారణం అని సిఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ వాదనను తిప్పికొట్టిన స్థానిక బిజెపి వర్గాలు నిజానిజాలను జాతీయ దర్యాప్తు సంస్థ ( నియా) సమగ్ర దర్యాప్తుతో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News