Monday, December 23, 2024

బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణ: 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా అంశం హింసాగ్నిని రగిల్చింది. పలు ప్రాంతాలలో చెలరేగిన ఘటనల్లో ఇప్పటివరకూ సాతిక మంది చనిపోయారు. 2500 మందికిపైగా గాయపడ్డారు. ఒక్క గురువారమే హింసాత్మక ఘటనల్లో కనీసం 18 మంది మృతి చెందారు. ప్రభుత్వోద్యోగాలకు రిజర్వేషన్ కోటా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢాకా ఇతర చోట్ల విద్యార్థులు తీవ్రస్థాయి నిరసనలకు దిగుతున్నారు. కోటాలు వద్దు, ప్రతిభే ప్రధాన అని వర్శిటీలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. దీనితో విద్యాలయాలు అట్టుడికిపోతున్నాయి.

అంతర్గత పరిణామాలు ఇప్పుడు రోడ్లకు చేరాయి. దీనితో పరిస్థితి అదుపు తప్పింది. గురువారం ఢాకాలోని రాంపూరా ప్రాంతంలో విద్యార్థుల గుంపు అధికారిక బంగ్లాదేశ్ టెలివిజన్ భవన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దీని ముందు భాగాన్ని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. లోపల చాలా సేపటివరకూ జర్నలిస్టులు, సిబ్బంది చిక్కుపడాల్సి వచ్చింది. వారం రోజులపై నుంచి స్థానిక యూనివర్శిటీ విద్యార్థులు, ఇతర చోట్ల ఉన్న యువత ధర్నాలు సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న కోటా వ్యవస్థలో మార్పులకు వీరు పట్టుబడుతున్నారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలకు రిజర్వేషన్ల విధానాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధ వీరుల బంధువులకు కూడా కోటా వర్తించరాదని కోరుతున్నారు. కేవలం ప్రతిభ ప్రాతిపదికన జాబ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గురువారం ఒక్కరోజు 18 మంది పలు ఘటనలలో చనిపోయ్యారని, 2500 మందికి పైగా గాయపడ్డారని ది డైలీ స్టార్ పత్రిక తెలిపింది. పలు చోట్ల నిరసనకారులకు, పోలీసులకు, అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. పలు ప్రైవేటు వర్శిటీలు నెలకొని ఉన్న ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇక్కడ పోలీసులకు నిరసనకారులకు మధ్య యుద్ధ వాతావరణ ఏర్పడిందని ప్రైవేటు టీవీ ఛానల్ సోమోయ్‌తెలిపింది. పలు ప్రాంతాలలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని షేక్ హసీనా పిలుపు నిచ్చారు. మరో వైపు దేశంలో కోటా వ్యవస్థ గురించి కేసు సుప్రీంకోర్టు విచారణ పరిధికి చేరింది. వాదనల తరువాత తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే సత్వర విచారణకు తాము పిటిషన్ వేస్తామని న్యాయశాఖ మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News