Monday, December 23, 2024

ఎపిలో పోలింగ్ హింసాత్మకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలు, దాడులు, హింసాత్మ క ఘటనల నడుమ ముగిసింది. 120కి పైగా ఉద్రిక్త ఘ టనలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల దాడులు, ప్రతిదాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. సోమవారం సాయంత్రం 6 గంటలతో రా ష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ పోలింగ్ క్రతువు పూర్తయింది. 6 గంటలకు ఇంకా క్యూ లో నిలబడ్డ వారికి మాత్రం ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. దాదాపు 70 శాతం పోలింగ్ శా తం నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు భావిస్తు న్నా రు. కచ్చితమైన ఓటింగ్ శాతాన్ని ఇసి మంగళవా రం ప్రకటించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థుల భవితవ్యం మొత్తం ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వాటిని ప్రత్యేక నిబంధనల మధ్య సీల్ చేసి, ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు.

ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొ త్తం 46, 389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏ ర్పాటు చేసింది. ఈ ఎన్నికల వేళ శాంతి భద్రతలు కాపాడడం కోసం 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎ న్నికల సంఘం మోహరించింది. అయినప్పటికీ సమస్యాత్మక నియోజకవర్గాలు సహా చాలా చోట్ల హింసాత్మ క ఘటనలు చోటు చేసుకోవడం విశేషం. ఎపిలో మూ డు ని యోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ము గిసి పోయింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో పో లింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరు లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరిగింది.

దాడులు, ప్రతిదాడులు…
పోలింగ్ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. ఎపి ఎన్నికలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కాగానే ఎక్కడో ఒక హింసాత్మక ఘటన జరుగుతూనే ఉంది. పోలింగ్‌లో ఘర్షణలు తలెత్తి, వైసిపి, జనసేన, టిడిపి నేతలు కలబడి కొట్టుకోవడం, రాళ్లు విసరురుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి లాంటి చోట్ల ఏకంగా ఎస్‌పి వాహనంపైనే దుండగులు రాళ్లతో దాడి చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతూనే పల్నాడు జిల్లాలో మొదలైన ఉద్రిక్తతలు వెంటవెంటనే వివిధ చోట్ల కూడా వెలుగులోకి వచ్చాయి. రెంటచింతల మండలం రెంటాలలో టిడిపి, వైసీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగగా ముగ్గురు టిడిపి ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి, రైల్వే కోడూరు, గన్నవరం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

టిడిపి ఏజెంట్ల కిడ్నాప్
చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో ఏడుగురు పోలింగ్ ఏజెంట్లను వైసిపి నాయకులు ఎత్తుకెళ్లారు. ఎంపి అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారు. మరో స్వతంత్ర అభ్యర్థికి చెందిన పోలింగ్ ఏజెంట్లను సైతం కిడ్నాప్ చేశారు. పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టిడిపి ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టిడిపి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైసిపి నాయకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో టిడిపి ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర ఉన్నారు. వైసిపి నేతలే కిడ్నాప్ చేశారని టిడిపి నేతలు వెల్లడించారు. అదే విధంగా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఇసికి టిడిపి ఫిర్యాదు చేసింది. పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టిడిపి ఏజెంట్లపై దాడి
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టిడిపి ఏజెంట్లపై వైసిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మూకల దాడిలో ఇద్దరు టిడిపి ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో గొలవలపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో కొందరు ఈవీఎంలు పగలగొట్టారు. పోలింగ్ నిలిచిపోగా, తమ పోలింగ్ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురంలో టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా, 2 కార్లు ధ్వంసం అయ్యాయి.

తెనాలిలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్రమైన ఘటన జరిగింది. ఎంఎల్‌ఎ శివకుమార్ క్యూలైన్‌లో నిలబడకుండా నేరుగా వెళ్లడంపై ఓ ఓటరు అభ్యంతరం తెలిపారు. లైన్‌లో నిలబడాల్సిందిగా కోరారు. దీంతో సహనం కోల్పోయిన ఎంఎల్‌ఎ ఓటరును చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు ఎంఎల్‌ఎ చెంప కూడా చెళ్లుమనిపించారు. టిడిపి ఎంపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై వైసిపి శ్రేణులు దాడికి తెగబడగా, 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి.
పోలింగ్ అధికారులతో వైసిపి నేతల వాగ్వాదం
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైసిపి నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించలేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైసిపి నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతోనే అనుమతించడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వైసిపి నాయకులు పోలింగ్ కేంద్రంలోకి రావడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆదివారం సాయంత్రమే ఏజెంటు పాసులు తీసుకోవాలని అధికారులు కోరారు. నిబంధనలు పెట్టినా పాసులకు దరఖాస్తు వైసిపి ఏజెంట్లు చేయలేదు. సోమవారం నేరుగా పోలీంగ్ కేంద్రానికి వచ్చి పాసులు ఇవ్వాలన్నారు. దీంతో పాసులు ఇచ్చేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించారు. పోలింగ్ అధికారులతో వైసిపి నాయకులు వాగ్వాదానికి దిగారు. గొడవ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

వైసిపి దౌర్జన్యం
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో వైసిపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల నుంచి టిడిపి ఏజెంట్లను వైసిపి నాయకులు బయటకు లాగేశారు. 201వ పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్లను బయటకు లాగేయడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
మరోచోట టిడిపి ఏజెంట్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి ఏజెంట్ వాహనం ధ్వంసం చేసి, ఏజెంట్ ఫారాలు లాక్కెళ్లారు. సుభాష్ అనే టిడిపి ఏజెంట్‌ను కిడ్నాప్ చేశారు. అదే విధంగా వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసిపి నేతలు దౌర్జన్యానికి పాల్ప డ్డారు. టిడిపి ఏజెంట్లను బయటకు లాగేశారు. వైసిపి కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టిడిపి అభ్యంతరం తెలిపింది.
ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లు
శ్రీశైలంలోని 4, 5 పోలింగ్ కేంద్రాల్లో వైసిపి ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా కూర్చోపెట్టొద్దని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ చేశారు. పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న మాజీ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఈఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు.

కొడాలి నాని అనుచరుల హల్‌చల్
కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి కొడాలి నాని అనుచరుల హల్‌చల్ చేశారు. నాగవరప్పడులో అర్ధరాత్రి తలుపులు బాది రోడ్ల మీదకి రావాలని పిలిచారు. టిక్ పెట్టుకున్న కొంతమందికి డబ్బులు ఇచ్చారు. దీంతో కొందరికే డబ్బులు ఇస్తున్నారు ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎదురు దాడి చేసేందుకు కొడాలి నాని అనుచరుల యత్నించారు. జనం ఎదురు తిరగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టిడిపి కార్యకర్తలకు గాయాలు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపడంపై టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. వైసిపి నాయకుల దాడిలో ఇద్దరు టిడిపి కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశావారిపాలెంలో ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైసిపి నాయకులు వాగ్వాదానికి దిగారు. టిడిపికి ఓటు వేయవద్దంటూ చెప్పారు. దీనిపై యువకుడు ప్రశ్నించడంతో వైసిపి శ్రేణులు దాడిచేశారు. యువకుడి తలకు స్వల్ప గాయం అయింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం మొక్కపాడులో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. అదే విధంగా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో దాడులు చేసుకున్నారు. టిడిపి కార్యకర్త తలకు గాయం అయింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నడికుడిలో టిడిపి నేత నెల్లూరు రామకోటయ్యపై వైసిపి నేతలు దాడి చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టిడిపి కార్యకర్తపై వైసిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం ముప్పాళ్లలో పోలింగ్ కేంద్రం వద్ద పలువురు ఓటర్లపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు.

గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసిపి, టిడిపి శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ముస్తాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ వివాదం జరిగింది. వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ, టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు ఎదురు పడ్డారు. ఆ సమయంలోనే అభ్యర్ధుల సమక్షంలో కార్యకర్తలు తలపడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నాయకులను అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

పెనమలూరులో ఉద్రిక్తత
మంత్రి జోగి రమేష్ తనయుడి హల్చల్, పోలీసుల లాఠీ చార్జ్
రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్న పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ అనుచరులతో హల్చల్ చేశాడు. వందలాది మంది కార్యకర్తలతో పోలింగ్ కేంద్రానికి జోగి రాజీవ్ చేరుకోవడంతో టిడిపి శ్రేణులు కూడా భారీగా మొహరించాయి. ఉప్పులూరు ప్రాథమిక పాఠశాల వద్ద ఇరువర్గాలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జోగి రమేష్ వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

జోగి రమేష్‌పైన టిడిపి కూటమి నుండి బోడే ప్రసాద్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పెడన నుండి గెలిచిన జోగి రమేష్ అయితే ఇక్కడ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసి ఓటర్లలో పట్టు కోసం ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికలలో పెడన నుంచి వైసిపి ఎంఎల్‌ఎ గెలుపొందిన జోగి రమేష్ వైసిపి ప్రభుత్వంలో రెండోసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసిపి ఎంఎల్‌ఎగా గెలిచిన కొలను పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరడంతో పెనమలూరు వైసిపి అభ్యర్థిగా జోగి రమేష్ పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. దీంతో పెనమలూరు లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నం చేస్తున్న జోగి రమేష్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు.

దొంగ ఓట్లు
తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం తిమ్మసముద్రంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. శ్రీకాళహస్తికి చెందిన 24 ఓటర్లు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు టిడిపి నేతలు ఆరోపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగఓట్లు కలకలం సృష్టించాయి. విద్యానగర్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని మంత్రి రజినికి ఏజెంట్ సమాచారం ఇవ్వగా ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం బయట అధికంగా ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసం కాగా పలు చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య ఘర్షణ నెలకొంది. చిల్లకూరు జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి అభ్యర్థి మురళి, టిడిపి అభ్యర్థి సునీల్ మధ్య వాగ్వాదం నెలకొంది.

ఎపిలో వివిధ పార్టీలు ఇలా…
ఎపిలో ప్రధానంగా ఉన్న పార్టీలు వైసిపి, టిడిపి, జనసేనతో పాటు అంతగా ప్రాబల్యం లేని బిజెపి, కాంగ్రెస్ లు కూడా బరిలో ఉన్నాయి. వైసిపి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా టిడిపి మాత్రం బిజెపి, జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగింది. వైసిపి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్ సభ స్థానాలు దక్కాయి. టిడిపి 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తోంది.
ఇసికి చంద్రబాబు లేఖ
ఎపిలో జరిగిన అనేకమైన ఉద్రిక్తతలు జరిగాయని సాయంత్రం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు పోలింగ్ జరిగిన ఒకే రోజు 120కి పైగా హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. అన్ని చోట్లా వైసిపి నేతలు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News