చండీగఢ్ : పంజాబ్‌లోని జైళ్లలో వీఐపీ గదులను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఆ గదులన్నీ మేనేజ్‌మెంట్ బ్లాకులుగా మార్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆప్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం లోని జైళ్లలో 710 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఎం తెలిపారు. ఇకపై జైళ్ల నుంచి ఫోన్ కాల్స్ ఉండవు. మోసపూరిత కార్యకలాపాలకు అవకాశం ఉండదన్నారు. ఫోన్లను లోపలికి పంపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ జైళ్లలో మొబైల్ ఫోన్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా ఫోన్లు సీజ్ చేసినట్టు తెలిపారు. తమ రాష్ట్రం లోని కారాగారాలు ఇప్పుడు అసలైన సంస్కరణ గృహాలుగా మారతాయన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా న్యాయస్థానాల్లో దోషిగా తేలిన వ్యక్తులు జైళ్లకు వెళ్లే సరికి ఎలా వీఐపీ అవుతారో తనకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందని భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు.