Wednesday, January 22, 2025

చలో ఎపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వేల సంఖ్యలో విఐపిలు తరలివెళ్తున్నా రు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ తదితర పట్టణాల్లో హో టళ్లు, లాడ్జీలు మాత్రమే కాకుండా ఆయా కోస్తా జిల్లాల్లోని ఫాంహౌస్‌లు కూడా నిండిపోయాయి.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వేలసంఖ్యలో విఐపిల వాహనాల తరలివెళ్తుండడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో టోల్‌ప్లాజాల వద్ద సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడ నుంచి విశాఖపట్నం జాతీయ రహదారి మొత్తం సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు తిలకిస్తూ బెట్టింగ్‌లు కాచే విఐపిల వాహనాలతో రద్దీగా మారాయి. జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహానాలు బారులు తీశాయి. వాహనాల రద్దీని తట్టుకునేందుకు ఈ టోల్‌ప్లాజా వద్ద పది కౌంటర్లను తెరిచారు.

విఐపిలంతా ఆంధ్రాలోనే

క్రికెట్ మ్యాచ్‌లకు మించిన క్రేజీ ఉన్న కోడిపందాల కోసం తెలంగాణలోని విఐపిలు, సినీతారలు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్ళారు. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు అక్కడికి చేరుకున్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో సినీతారలు సందడి చేస్తున్నారు.

కోట్ల రూపాయల్లో బెట్టింగ్

సంక్రాంతి కోడి పందాల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. పందాల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి కోడిపుంజులను బెట్టింగ్‌రాయుళ్ళు ఖరీదు చేస్తున్నారు. అందులోనూ డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారం పెట్టి పెంచిన కోడిపుంజులను లక్షలు వెచ్చిస్తున్నారు. కోడిపందాలకు అనుబంధంగా గుండాట, పేకాట, ఆడుకునేందుకు ప్రత్యేక శిబిరాలను పందాల నిర్వహకులు ఏర్పాటు చేశారు. జూదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్, గుండాట, పేకాటల కోసం హైదరాబాద్, విజయవాడ నగరాలకు చెందిన కాంట్రాక్టర్లు లక్షల్లో నిర్వహకుల నుంచి వేలంపాట పాడుకుంటున్నారు. గుండాట, పేకాట శిబిరాలను రూ. 60 లక్షల నుంచి 80 లక్షల వరకు పాటదారులు పాడుకుంటున్నారు. పార్కింగ్ ప్రదేశానికి రూ.10 లక్షల వరకు పాటపాడుకుంటున్నారు. అలాగే బిర్యానీ పాయింట్లు, శీతలపానీయాలు, గుట్కాలు, సిగరెట్లు అమ్మవారికి ఒక్కక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలు వసూలు చేస్తున్నారు నిర్వహకులు.

తెలంగాణ నుంచి తరలిన పందెం కోళ్లు

తెలంగాణ జిల్లాలో ఉన్న వివిధ ఫాంహౌస్‌లో పెంచిన పందెం కోళ్ళను పందెంరాయుళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. కోడి పందాలు ప్రసిద్ధి చెందిన గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ కోళ్ళు వెళ్తున్నాయి. నెల రోజుల ముందే సామర్లకోట, వేట్లపాలెం, భీమవరం, కాకినాడ తదితర ప్రాంతాలకు తెలంగాణ కోడిపుంజులును పందెంరాయుళ్ళు పంపించారు.

ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన రంగవల్లుల పోటీలతో పాటు ఆటవిడుపుగా కోళ్ళ పోటీలను పెట్టారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎపికి చెందిన ఓ మంత్రి పాల్గొనడం గమనార్హం.

పందాలపై కోనసీమలో ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ అంతటా కోడిపందాలు జరుగుతుంటే, అందుకు భిన్నంగా కోనసీమ జిల్లాలో పరిస్ధితి ఉంది. సంప్రదాయ క్రీడగా జరుగుతున్న కోడి పందాలను ఆ జిల్లా అధికారయంత్రాంగం అడ్డుకుంటుందని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్ మండిపడుతున్నారు. ఈ జిల్లాలో ప్రతి మండలంలో 144 సెక్షన్ విధించారు. కోడిపందాల ముసుగులో జూదం, గుండాట, పేకాట, మేళాలు వంటి జరగకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News