వివిధ రకాల వైరస్‌లు మనుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. కంటికి కనిపించని, మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగే ఈ సూక్ష్మజీవులు కలిగిస్తున్న హాని అంతా ఇంతా కాదు. తరచిచూస్తే ఏటా వైరల్ వ్యాధులబారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. గడచిన శతాబ్దం చివరి నాళ్లలో వెలుగుచూసిన హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవి).. ఎయిడ్స్ వ్యాధికి దారి తీసి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళించింది. ఈ సహస్రాబ్ది తొలినాళ్లలో వెలుగుచూసిన డెంగీ, చికున్ గున్యా, ఎబోలా వంటి కొత్తరకం వ్యాధులూ వైరస్‌ల పుణ్యమే.
ఇక నాలుగేళ్ల కిందట ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మహమ్మారి కోరలకు చిక్కుకుని విశ్వమే విలవిల్లాడింది. ఇప్పటికీ దీని ప్రభావం కొనసాగుతూనే ఉందని చెప్పడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీని బారినపడటాన్ని తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. మానవాళికి సవాల్ విసురుతున్న వైరల్ వ్యాధులను అరికట్టేందుకు ఒకవైపు శాస్త్ర పరిశోధనలు కొనసాగుతూండగానే, మరోవైపు కొత్తరకం వైరస్‌లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చి, రకరకాల వ్యాధులను వ్యాపింపచేస్తున్నాయి. కేరళను వణికిస్తున్న నిఫా వైరస్, గుజరాత్‌ను అల్లకల్లోలం చేస్తున్న చాందీపురా వైరస్ ఈ కోవలోకే వస్తాయి. అయితే ఈ రెండూ కొత్తగా ఇప్పటికిప్పుడే వెలుగుచూసిన వైరస్‌లు కావు. మొదటిసారిగా మలేసియాలో 1999లో బయటపడిన నిఫా వైరస్ ఆ తర్వాత బంగ్లాదేశ్ లోనూ దర్శనమిచ్చింది.
ప్రస్తుతం కేరళలోని మలప్పురం జిల్లాలో బయటపడిన నిఫా.. ఆరేళ్ల క్రితం ఇదే జిల్లాలో ఒక మోస్తరుగా వ్యాప్తి చెందింది. గబ్బిలాలు, పందుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వ్యాధికి వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. గుజరాత్‌లో కలకలం సృష్టిస్తున్న చాందీపురా వైరస్ ది కూడా ఇలాంటి కథే. పదిహేనేళ్లలోపు చిన్నారులకు ఒక రకం కీటకాల (శాండ్ ఫ్లై) ద్వారా సోకే ఈ వ్యాధి కూడా ఉపేక్షించడానికి వీల్లేనిదే. ఇండియాలో ఈ వైరస్ జాడ అరవయ్యేళ్ల క్రితమే బయటపడింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇరవయ్యేళ్ళ క్రితం చాందీపురా వైరస్ కారణంగా 300 మంది చిన్నారులు కన్నుమూసినట్లు రికార్డులు చెబుతున్నాయి. నాగపూర్ జిల్లాలోని చాందీపురాలో ఈ వైరస్‌ను కనుగొనడంతో దీనికి చాందీపురా వైరల్ ఎన్ సెఫలైటిస్‌గా నామకరణం చేశారు. ఒకప్పుడు ఉష్ణమండల దేశాలకు మాత్రమే పరిమితమైన అంటువ్యాధులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పొడసూపుతున్నాయి.
వీటిలో వైరల్ వ్యాధులదే అగ్రస్థానం. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో ప్రాణాంతక వైరల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. వీటికి గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌లలో కణ వ్యవస్థ అంటూ ఏదీ ఉండదు. ఆతిథేయిని ఆశ్రయించినప్పుడు మాత్రమే తమ సంఖ్యను పెంచుకునే ఈ అకణజీవులు మొక్కలతో సహా ప్రాణమున్న ఏ జీవినైనా ఆశ్రయించి, వాటి కణవ్యవస్థను హైజాక్ చేయడం వీటి సహజ గుణం. పుట్టల కొద్దీ పుట్టుకొస్తున్న వైరస్‌ల కారణంగా సంక్రమిస్తున్న వ్యాధులను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న పరిశోధనలు కొలిక్కి రావడానికి ఎంతో సమయం పడుతోంది. ఈలోగానే కొత్తరకం వైరల్ వ్యాధులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో వెలుగు చూసిన నిఫా, చాందీపురా వైరస్‌లు బయటపడి కొన్ని దశాబ్దాలు గడిచాయి.
వీటిని ప్రపంచ ఆరోగ్యసంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం బ్లూప్రింట్ ప్రాధాన్యత గల వ్యాధులుగా గుర్తించినా, ఇప్పటి వరకూ వీటి నివారణకు మందులు గానీ, నిరోధానికి టీకాలు గానీ కనుక్కోలేకపోవడం పరిశోధనలు వేగవంతం కావలసిన విషయాన్ని నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వైరాలజీ పరిశోధనల సంస్థల కార్యకలాపాలు ఊపునందుకోవలసిన అవసరం ఉంది. కరోనా వైరస్ మానవాళికి పెను సవాల్ విసిరిన నేపథ్యంలో కొత్తగా వెలుగుచూస్తున్న వైరస్‌ల భరతం పట్టేందుకు దేశదేశాల్లో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తల మధ్య సమాచార మార్పిడి వేగిరం జరగడం వల్ల పరిశోధనలు త్వరితగతిన కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుం ది. అప్పటి వరకూ ఆయా వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్న ఆతిథేయి జంతువులకు దూరంగా మసలుకోవడం, ఒకవేళ వ్యాధి సోకితే తక్షణం వైద్యులను సంప్రదించి నివారణ చర్యలు చేపట్టడమే శరణ్యం.