మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల భారీ వర్షాలకు వైరస్ ప్రభావంతో కళ్ల కలక సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఐదారు రోజుల నుంచి కళ్ల కలక మరింత వే గంగా విస్తరిస్తూ ప్రజల ను ఆసుపత్రుల బాట పట్టిస్తుంది. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కం టి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు బాధితులు క్యూ క డుతున్నారు. తెలంగాణతో పాటు ఎపి,ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.4 రోజుల వ్యవధి లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క సరోజనీదేవి ఆసుపత్రికే రోజుకు 250 మందికి పైగా బాధితులు వస్తున్నారని, ఇప్పటివరకు 2400 మందికి సేవలు అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.ఎక్కువగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే వారికే సోకుతుందని, వరద బాధిత ప్రాంతాలైన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం , రంగారెడ్డి, మేడ్చల్,
నల్లగొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల నుంచి గత రెండు రోజులుగా కేసులు భారీ నమోదైతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో కస్తూర్భాలు, ఆదర్శ బడుల్లో విద్యార్థులకు వచ్చిందని చెప్పారు. గ్రేటర్ పరిధిలో పలు ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు,షాపింగ్ మాల్స్‌లో పనిచేసే వారికి ఈసమస్యలు వస్తున్నట్లు ఎల్వీ ప్రసాద్ వైద్యులు చెబుతున్నారు. తమ ఆసుపత్రిలో వారం రోజుల నుంచి 800 మందికి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే వైరస్ ఇన్ ఫెక్షన్లలో కళ్ల కలక కూడా ఒకటని వర్షాలతో గాలిలో తేమ కారణంగా వైరస్‌లు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న బాధితులలో ఎక్కువ మందికి అదెనో వైరస్ వంటి ప్రత్యేక వైరస్ కారణమని పరీక్షల్లో తేలిందన్నారు.
వ్యాధి వ్యాప్తి : ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఆవైరస్ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది. ఒక వ్యక్తి ముక్కులో, సైనస్‌లో ఉండే వైరస్, బాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం ద్వారా ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదముంది. కాంటాక్టు లెన్స్ వినియోగించే అలవటు ఉన్నవారు వాటిని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. సరైన లైన్స్ వాడకపోవడంతో కలక రావొచ్చు.
కళ్ల కలక బాధితులకు వైద్యుల సూచనలు : లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం, చేతులు పెట్టరాదు, శుభ్రమైన టిష్యూ కాగితం చేతి గుడ్డతో కండ్లు తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాంటాక్ట్ లైన్స్ పెట్టుకునేవారు వెంటనే వాటి వాడకం ఆపేయాలి. వైరస్‌తో కలిగే సమస్య ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది. భ్యాక్టీరియా సమస్య ఏర్పడితే సరైన ఔషదాన్ని తగిన మోతాదులో తీసుకోవాలి.
నివారణకు మార్గాలు : దీనిని నివారించడానికి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కళ్లకలక ఉన్నవారు వాడిన చేతి గుడ్డ, శరీర శుభ్రం చేసుకునే గుడ్డను ఇతరులు వాడొద్దు. వైద్యుల పర్యవేక్షణలో సేవలు పొందాలి. వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ సీజన్ లో కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. బయట నుంచి వచ్చాక గోరువెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవాలని సూచించారు. తీవ్రమైన కళ్ల కలక (ఎపిడమిక్ కెరటో కంజంక్టివైటిస్ ) విషయంలో అప్రమత్తత అవసరమని డాక్టర్లు చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలంలో దృష్టి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళ్ల కలక మరీ బాధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నాడు.
కళ్ల కలక పట్ల విద్యార్థులు జాగ్రత్తల పాటించాలి : వాతావారణ ప్రభావంతో కళ్ల కలక వేగంగా విస్తరిస్తుందని ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సరోజనీ ఆసుపత్రి వైద్యాధికారి రాజలింగం పేర్కొన్నారు. కళ్ల కలక గుర్తించినప్పటి నుంచి సాధ్యనంతవరకు వ్యక్తులకు దూరంగా ఉండాలని, వారం రోజుల పాటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే త్వరగా నయం అవుతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల పనిచేసే సంస్ధలు ఒకరికి సోకిన వెంటనే అతని ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు.