అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
వ్యాధుల నివారణకు పకడ్భంధీ చర్యలు
ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన
ఇప్పటికే ఆసుపత్రులకు క్యూ కట్టిన రోగులు
బస్తీదవాఖానాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు రెట్లు ఓపీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాల కారణంగా పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలు, వదరల వల్ల ఏర్పడ బురద, చెత్తాచెదారం, మురికినీళ్లలో దోమలు విజృంభించనున్నాయి. దాంతో రోగాలు మరింత ప్రబలే అవకాశం ఉన్నది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డ నేపథ్యంలో ప్రధానం చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని, వీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే వర్షాల కారణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిహెచ్‌సి స్థాయి నుంచి పెద్దాసుపత్రుల వరకు అన్ని స్థాయిలలో మందులు అందుబాటులో ఉంచి అన్ని స్థాయిలలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. నివారణ చర్యలు చేపడుతూనే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మలేరియా కంటే క్రమంగా డెంగీ కేసులే అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలు,ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల కట్టడికి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డిహెచ్) ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విస్తరణ కట్టడిపై ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇంటింటి సర్వేను కొనసాగించనున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి బాధితులకు తగిన వైద్యం అందించనున్నారు.
రోగులతో కిక్కిరిపోతున్న ఆసుపత్రులు
వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జర్వం, జలుబు, గొంతునొప్పి,ఒంటినొప్పులు, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కట్టారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని రోజులుగా విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వైరల్ జ్వరాలు పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిపోతున్నాయి. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లోనే రోజుకు వెయ్యి వరకు ఓపీ ఉంటోంది.
సీజన్‌మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా నాలుగు రెట్ల వరకు ఎక్కువ ఒపి ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. బస్తీదవాఖానాలలో ప్రజలకు తమ ఇంటి సమీపంలోనే వైద్యం లభిస్తోంది. దాంతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రికి ఓపీ గతంలో కంటే కొంతమేర తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ జ్వర బాధితులే
ప్రభుత్వ బోధనాసుపత్రులు మాత్రమే కాదు పిహెచ్‌సిలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్..ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌తోపాటు జ్వర బాధితుల ఇంటి సమీపంలోని క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని ఆసుపత్రులు, పిహెచ్‌సిలు, క్లినిక్స్‌లలో ఓపీలు కిటికిటలాడుతున్నాయి.
దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
వర్షాలు, వదరల వల్ల ఏర్పడ బురద, చెత్తాచెదారం, మురికినీళ్లలో దోమలు విజృంభించనున్నాయి. దోమల వల్లనే ఎక్కువగా రోగాలు ప్రబలనున్నాయి. అయితే దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల చాలావరకు వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచించారు. ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదాహరణకు ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లనే దోమలు వ్యాపించి, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని, దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.