Monday, December 23, 2024

విరాట్ నయా చరిత్ర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వన్డే క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నయా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 50వ శతకాన్ని సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 అత్యధిక శతకాల రికార్డును తిరగ రాశాడు. ఈ మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కోహ్లి చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో 50వ సెంచరీని పూర్తి చేసి అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 49వ వన్డే శతకాన్ని అందుకున్నాడు. అయితే కోహ్లి మాత్రం కేవలం 279 ఇన్నింగ్స్‌లలోనే 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం. కోహ్లి కెరీర్‌లో ఇది ఓవరాల్‌గా 80వ శతకం కావడం గమనార్హం.

వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టి20లలో ఒక శతకాన్ని కోహ్లి సాధించాడు. సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 113 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 9 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లికి ఇది మూడో శతకం. సొంత గడ్డపై జరుగుతున్న మెగా టోర్నమెంట్‌లో కోహ్లి ఇప్పటి వరకు పది మ్యాచుల్లో 101.57 సగటుతో 711 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు, మరో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో సచిన్ పేరిట ఉన్న ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల రికార్డును కూడా విరాట్ కోహ్లి బద్దలు కొట్టాడు. సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు సాధించాడు. ఇది ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. అయితే ఈసారి వరల్డ్‌కప్‌లో కోహ్లి 711 పరుగులు సాధించి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సచిన్ భావోద్వేగం..
విరాట్ కోహ్లి వన్డేల్లో సాధించిన 50 శతకాల రికార్డుపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. తన పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడంపై సచిన్ స్పందించాడు. కోహ్లిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. కోహ్లి తనను తొలిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. మొదటిసారి నిన్న ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు.. నా పాదాలను తాకుతుంటే సహచర ఆటగాళ్లు నిన్ను ప్రాంక్ చేశారు. అప్పుడు నాకు నవ్వు ఆగలేదు. అయితే నీ అంకితభావం, క్రీడా నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్.. ఆ యువ క్రికెటర్ విరాట్ ప్లేయర్‌గా ఎదిగినందుకు ఎంతో గర్విస్తున్నానను అంటే సచిన్ ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News