కొలంబో: రికార్డుల రారాజు, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్ సూపర్4 మ్యాచ్‌లో కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి వన్డే కెరీర్‌లో 13000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అంతేగాక వన్డేల్లో 47వ శతకాన్ని నమోదు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి కెరీర్‌లో ఇది 77వ అంతర్జాతీయ శతకం కావడం విశేషం. ఇదే క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
కోహ్లి 267 ఇన్నింగ్స్‌లలో వన్డేల్లో 47 సెంచరీలు పూర్తి చేశాడు. అంతేగాక అత్యంత వేగంగా వన్డేల్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కూడా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోహ్లి 267 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కొన్నేళ్ల పాటు పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమైన కోహ్లి ఈ ఏడాది మాత్రం అసాధారణ ఆటతో చెలరేగి పోతున్నాడు. 2023లో ఏకంగా ఆరు శతకాలు సాధించి పూర్వవైభవాన్ని అందుకున్నాడు. కోహ్లి మళ్లీ ఫామ్‌ను అందుకోవడం రానున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా శుభసూచకంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.