ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో ఘోరంగా విఫలమైన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీలో ఆడడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడు. రైల్వేస్‌తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్‌లో కోహ్లి బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి పూర్తిగా నిరాశ పరిచాడు. 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక ఫోర్‌తో 6 పరుగులు చేసి రైల్వే బౌలర్ హిమాన్షు సంగ్వాన్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లి బ్యాటింగ్ విన్యాసాలను చూడాలని భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. కోహ్లి తన పేలవమైన ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగిస్తూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
కొంత కాలంగా కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవాలనే లక్షంతో రంజీ బరిలోకి దిగాడు. కానీ రంజీలోనూ అతని బ్యాటింగ్ తీరు ఏమాత్రం మారలేదు. బంతిని అంచన వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక ఈమ్యాచ్‌లో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట నష్టానికి 334 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయూష్ బడోని 77 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సుమిత్ మాథూర్ 78 (బ్యాటింగ్), సిద్ధాంత్ శర్మ 15 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ఢిల్లీ ఇప్పటి వరకు 93 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధిం చింది. కాగా, రైల్వేస్మొదటి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.