మళ్లీ తేలిపోయిన కోహ్లీ
మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన పేలవమైన ఫామ్‌ను ఇంగ్లండ్ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఆదివారం కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో కోహ్లి పేలవమైన ఫామ్‌తో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఫామ్‌ను అందుకోవాలనే లక్షంతో రంజీ ట్రోఫీలో సయితం బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దొరికినా కోహ్లి సద్వినియోగం చేసుకోలేక పోయాడు. మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో విరాట్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది.
వరుస అవకాశాలు లభిస్తున్నా కోహ్లి మాత్రం తన బ్యాటింగ్‌ను ఏమాత్రం మెరుగుపరుచుకోలేక పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే వికెట్‌ను పారేసుకుంటున్నాడు. కోహ్లి బ్యాటింగ్ తీరు అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. అతను ఇలాగే ఆడితే రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు కాపాడుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒకప్పుడూ పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లి ఇటీవల కాలంలో కనీసం 25 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేక పోతున్నాడు. దీన్ని బట్టి అతని ఫామ్ ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. కివీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు దేశవాళీ, ఇంగ్లండ సిరీస్‌లలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు.
ఇది కోహ్లితో పాటు టీమ్‌ను ఆందోళన కలిగించే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి కొంతకాలంగా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో కోహ్లి ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లి గాడిలో పడితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక శతకంతో ఫామ్‌ను అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య తదితరులు బాగానే బ్యాటింగ్‌ను చేస్తున్నారు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు కూడా గాడిలో పడితే రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.