అందరి కళ్లూ కోహ్లిపైనే..
భారీ ఆశలతో బెంగళూరు
ఈ సీజన్‌లో బెంగళూరుకు విరాట్ కోహ్లి చాలా కీలకంగా మారాడు. సుదీర్ఘ కాలంగా బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లిపై ఈసారి కూడా బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కోహ్లి చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన జరిగిన సిరీస్‌కు విరాట్ దూరంగా ఉన్నాడు. చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉండడంతో ఐపిఎల్‌లో అతని బ్యాటింగ్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. కోహ్లితో పాటు కెప్టెన్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, హసరంగ, సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరుకు అందుబాటులో ఉన్నారు. మ్యాక్‌వెల్ కూడా ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. కాగా, పలువురు స్టార్ ఆటగాళ్లతో కూడిన బెంగళూరు సీజన్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఈసారైనా ఆ జట్టు ఐపిఎల్ ట్రోఫీ కల నెరవేరుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)కి ట్రోఫీ ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రతి సీజన్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగే ఆర్‌సిబి నిరాశతో ఇంటిదారి పట్టడం అనవాయితీగా వస్తోంది. ఐపిఎల్‌లోనే అత్యధిక అభిమానులు కలిగిన జట్టుగా ఆర్‌సిబికి పేరుంది. ఆరంభ సీజన్ నుంచి బెంగళూరుకు అభిమానులు బ్రహ్మరథం కడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే 16 సీజన్లు ముగిసినా బెంగళూరు ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడలేక పోయింది. రెండేళ్ల క్రితమే ఐపిఎల్‌కు శ్రీకారం చుట్టిన గుజరాత్ టైటాన్స్ కూడా ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ప్రారంభ సీజన్ నుంచి ఐపిఎల్ ఆడుతున్న బెంగళూరుకు మాత్రం ట్రోఫీ స్వప్నం కలగానే మిగిలిపోయింది. ఈసారి కప్ నమ్‌దే (ఈసారి కప్ మనదే) అనే నినాదంతో ఐపిఎల్ బరిలోకి దిగడం బెంగళూరుకు పరిపాటి. సీజన్17లో కూడా బెంగళూరు భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఛాలెంజర్స్ చాలా బలంగా ఉంది. తొలి సీజన్ నుంచే అత్యంత బలమైన ఆటగాళ్లు బెంగళూరుకు అందుబాటులో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, కుంబ్లే, ఎబి డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, మనీష్ పాండే, కెఎల్ రాహుల్, వెటోరీ, విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరు ప్రాతినిథ్యం వహించారు.
ఇంతమంది హేమాహేమీ ఆటగాళ్లు ఉన్నా బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. సుదీర్ఘ ఐపిఎల్ ప్రస్థానంలో ఛాలెంజర్స్ మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. 2009లో తొలిసారి బెంగళూరు ఫైనల్‌కు చేరింది. అయితే తుదిపోరులో అప్పటి డెక్కన్ చార్జర్స్ (హైదరాబాద్) చేతిలో ఓటమి పాలైంది. తొలి సీజన్‌లో బెంగళూరు, చార్జర్స్ జట్లు అట్టడుగు స్థానంలో నిలిచాయి. అయితే పాయింట్ల పట్టికలో చివరి వరుసలో నిలిచిన ఈ రెండు జట్లు 2009 ఫైనల్‌కు చేరడం విశేషం. 2011లో కూడా బెంగళూరు ఫైనల్‌కు చేరింది.
ఈసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి సారిగా 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో ప్రవేశించింది. ఈసారి కూడా బెంగళూరుకు నిరాశే మిగిలింది. మరోసారి ఫైనల్లో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. తర్వాత జరిగిన సీజన్‌లలో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అయితే 2020లో నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరు 2021, 22లలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే ఈ రెండు సార్లు కూడా ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. కాగా, కిందటి సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.