Monday, March 17, 2025

విరాట్ టాప్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ క్రీడా విభాగం: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఈ మ్యాచ్‌తో ఈ పొట్టి క్రికెట్ ప్రారంభంకానుంది. అయితే ఐపిఎల్ అంటేనే ధనాధన్. ఓ వైపు మెరుగు వేగంతో పరుగుల వరదపారించే బాటర్లు, మరోవైపు వారిని కట్టడి చేసేందుకు బంతితో మాయ చేసే బౌలర్లకు కొదువలేదు. అటు బ్యాట్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు ఉన్నారు. మరి 2025 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ బ్యాటర్లు, అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ఎవరో ఒకసారి చూద్దాం.
టాప్ బ్యాటర్లు వీరే
స్టార్ బ్యాటర్, పరగుల యంత్రం విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. మొత్తంగా 252 మ్యాచులు ఆడి 244 ఇన్నింగ్స్‌లో 8,004 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, 55 అర్ధ శతకాలు సాధించారు. 38.0 సగటుతో కొనసాగుతున్నాడు. కోహ్లీ అత్యధిక పరుగుల స్కోర్ 113 పరుగులు. టీమిండియా మాజీ ఆటగాడు శిఖర్ ధవన్ రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్ 222 మ్యాచ్‌ల్లో 127.14 స్ట్రైక్ రేట్‌తో 6,769 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 106 నాటౌట్. 2 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా సారధి రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ 257 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 43 అర్ధ శతకాలు బాది 6,628 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన డేవిడ్ వార్నర్ 184 మ్యాచ్‌ల్లో 6,565 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 126 పరుగులు. 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు చేశాడు. సిఎస్‌కె మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. 205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 100 నాటౌట్. రైనా ఐదో స్థానంలో ఉన్నాడు. కాగా, ఐపిఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ వీరి దరిదాపుల్లో ఏ బ్యాటర్ కూడా లేదు.
టాప్ బౌలర్లు వీరే..
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంతితో గింగిరాలు కొట్టించే ఈ మిస్టరీ స్పిన్నర్ చాహల్ 160 మ్యాచులు ఆడి 205 వికెట్లు తీసి.. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇక పీయూశ్ చావ్లా రెండో స్థానంలో ఉన్నాడు. చావ్లా.. 192 మ్యాచులు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఐపిఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రావో.. మొత్తం 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువనేశ్వర్ 176 మ్యాచులు ఆడి 181 వికెట్లు పడగొట్టాడు. విండీస్ ఆటగాడు సునీల్ నరైన్ సయితం అద్భుతంగా రాణిస్తున్నాడు. కోల్‌కతా తరఫున బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు నరైన్ మొత్తం 177 మ్యాచులు ఆడి 180 వికెట్లు పడగొట్టి ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News