ముంబై: ఊహించినట్టే జరిగింది. పేలమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై వేటుపడింది. వెస్టిండీస్‌తో జరిగే టి20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కోహ్లికి చోటు కల్పించలేదు. విశ్రాంతి పేరిట కోహ్లిని జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఇక విండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం 18 మందితో కూడిన జట్టును బిసిసిఐ గురువారం ఎంపిక చేసింది. సిరీస్‌లో రోహిత్ శర్మ టీమిండియాకు సారథ్యం వహిస్తాడు. కెఎల్.రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. రానున్న టి20 ప్రపంచకప్ సన్నాహకంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కానీ కీలకమైన సిరీస్‌లో కోహ్లిని పక్కనబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్టార్ బౌలర్లు బుమ్రా, షమీలకు కూడా జట్టులో స్థానం దక్కలేదు. విశ్రాంతి పేరిట వీరిని జట్టుకు ఎంపిక చేయలేదు. కానీ సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులో చోటు సంపాదించడం విశేషం. మరో కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విండీస్ సిరీస్‌లో స్థానం లభించలేదు. ఇదిలావుండగా వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం ఇప్పటికే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 29 నుంచి టి20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌లు విండీస్‌లో జరుగనుండగా మరో రెండు మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించనున్నారు.
టి20 సిరీస్ జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్,హర్షల్ పటేల్.
Virat Kohli not selected for West Indies Tour