Friday, December 20, 2024

రికార్డుల ‘కింగ్’ కోహ్లి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరున్న భారత స్టార్ విరాట్ కోహ్లి సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. వరుస సెంచరీలు, అర్ధ సెంచరీలతో ప్రపంచకప్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. సుదీర్ఘ కెరీరలో కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో 50వ శతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లి ఈ రికార్డును తిరగ రాశాడు. కెరీర్‌లో 50వ వన్డే సెంచరీ సాధించిన నయా చరిత్రను లిఖించాడు.

ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. 10 మ్యాచులో మూడు శతకాలు, ఐదు అర్ధ సెంచరీలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. కిందటి వరల్డ్‌కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన కోహ్లి ఈసారి మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. ఒకటి రెండు మ్యాచుల్లో తప్పిస్తే ప్రతిసారి మెరుగైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. 101.57 సగటుతో రికార్డు స్థాయిలో 711 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు.

ఇప్పటి వరకు సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా దీన్ని కోహ్లి బద్దలు కొట్టాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లి ఇప్పటికే రికార్డు స్థాయిలో 80 శతకాలు సాధించాడు. ఇందులో 50 శతకాలు వన్డేల్లో ఉండగా మరో 29 సెంచరీలు టెస్టుల్లో ఉన్నాయి. అంతేగాక అంతర్జాతీయ టి20ల్లో ఒక శతకాన్ని కోహ్లి సాధించాడు. ఇలా 80 సెంచరీలతో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ వంద శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News