ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. కొంత కాలంగా వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న విరాట్ ఈసారి కూడా స్థానాన్ని కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. 870 పాయింట్లతో కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బాబర్ ఆజమ్ 837 పాయింట్లతో మూడో, న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టెలర్ నాలుగో, ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ ముజీబుర్ రహ్మాన్ రెండో, భారత స్టార్ జస్‌ప్రిత్ బుమ్రా మూడో ర్యాంక్‌లో నిలిచారు.
బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ నాలుగో, క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌ను సాధించారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 123 పాయింట్లతో వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. 117 పాయింట్లతో భారత్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక న్యూజిలాండ్ మూడో, ఆస్ట్రేలియా నాలుగో, దక్షిణాఫ్రికా ఐదో ర్యాంక్‌లను దక్కించుకున్నాయి. ఐర్లాండ్‌అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లు ముగియడంతో ఐసిసి తాజాగా ర్యాంక్‌లను ప్రకటించింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానాన్ని కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. అదే విధంగా బౌల్ట్ కూడా తన ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉన్నా కూడా రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌ను కాపాడుకోవడం విశేషం.