జైపూర్: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంటే ముందుగా గుర్తొచ్చేది అతని దూకుడే.. ఆ తర్వాత గుర్తొచ్చేది అతని ఫిట్‌నెస్. మైదానంలో ఎంతో చురుకుగా ఉండేందుకు బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు కోహ్లీ. దాని కోసం.. తగిన కసరత్తులు, డైటింగ్‌లు చేస్తుంటాడు. ఈ కారణంగానే అతను మైదానంలో మెరుపు వేగంతో పరిగెత్తడం మనం చూస్తుంటాం. అయితే అంత ఫిట్‌గా ఉండే కోహ్లీకి గుండె నొప్పి వచ్చింది.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి విజయం సాధించగా.. కోహ్లీ అర్థ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ క్రమంలోనే కోహ్లీ అభిమానుల్లో ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. హసరంగ వేసిన 15వ ఓవర్‌లో కోహ్లీ సిక్సుతో అర్థ శతకాన్ని సాధించాడు. ఆ తర్వాతి బంతికి పడక్కల్‌తో కలిసి వేగంగా రెండు పరుగులు తీశాడు. దీంతో కోహ్లీ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏదో తేడాగా అనిపించి అక్కడే కీపింగ్ చేస్తున్న సంజూ శాంసన్‌ను పిలిచి గుండె చప్పుడు చూడమని అడిగాడు. దాన్ని పరిశీలించిన సంజూ ఫర్వాలేదని చెప్పడంతో తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే కోహ్లీ అలా ఇబ్బంది పడటం చూసి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ, కొందరు మాత్రం అది సాధారణ నొప్పేనని.. భయపడాల్సిన అవసరం లేదని సర్ధి చెబుతున్నారు.