జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమవుతాడా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. వన్డే కెప్టెన్సీ విషయంలో ఇటీవల చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకే జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌కు కొద్ది ముందు గాయం అనే సాకుతో కోహ్లి తప్పుకున్నాడని వార్తలు వినవస్తున్నాయి. అతనికి ఎలాంటి గాయం కాలేదని, కానీ తన పట్ల బిసిసిఐ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై అలిగి రెండో టెస్టుకు దూరమయ్యాడని వార్తలు వెల్లువెత్తాయి. కాగా, కోహ్లికి వెన్నునొప్పి సమస్య లేదని, అతను వాండరర్స్ స్టేడియంలో ముమ్మర సాధన చేస్తుండడమే దీనికి నిదర్శనమని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. బిసిసిఐ పెద్దలకు, కోహ్లికి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని, అందుకే అతను రెండో టెస్టు ఆడేందుకు ఆసక్తి చూపలేదని ఓ జాతీయ వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మూడో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు కూడా కోహ్లి దూరమవుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. కాగా, బిసిసిఐ పెద్దలు మాత్రం ఈ వార్తలను తోసి పుచ్చారు. వెన్ను నొప్పితో వేధిస్తుండడం వల్లే కోహ్లి రెండో టెస్టుకు దూరమయ్యాడని, తర్వాతి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని స్పష్టం చేస్తున్నారు. అంతేగాక వన్డే సిరీస్‌లో కోహ్లి బరిలోకి దిగడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు.
Virat Kohli to skip ODI Series against South Africa