ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ లాచ్‌లాన్ హెండర్సన్ సంతాపం తెలిపారు. ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యత్తమ ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా క్వీన్స్‌ల్యాండ్ తరఫున కూడా గొప్ప ఆటగాడుగా పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతో ఎనలేని అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ కష్ట సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున సైమండ్స్ కుటుంబానికి, సన్నిహితులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
కాగా క్రికెట్ ఆస్ట్రేలియా రెండు నెలల క్రితమే ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రాడ్‌మార్ష్, షేన్‌వార్న్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైమండ్స్ కూడా మృతి చెందడంతో ఆ జట్టు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. వార్న్ తన చివరి సందేశం రాడ్‌మార్ష్ గురించి పెట్టగా, సైమండ్స్ తన ట్విట్టర్‌లో ఆఖరి ట్వీట్ వార్న్ గురించి కావడం గమనార్హం. సైమండ్స్ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైమండ్స్ మృతివార్త విని షాక్‌కు గురయ్యానని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నారు. సైమండ్స్ భారత టి20లీగ్‌లో ముంబయి తరఫున ఆడేటప్పుడు తనకెన్నో తీపి జ్ఞాపకాలున్నాయని గుర్తు చేసుకున్నారు. అలాగే సైమండ్స్‌తో వివాదంలో చిక్కుకున్న హర్భజన్ సింగ్ కూడా సంతాపం తెలిపాడు. సైమండ్స్ మరణం తనను షాక్‌కు గురి చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశాడు.
Virat Kohli tribute to demise of Andrew Symonds