Friday, November 22, 2024

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లిది ప్రత్యేక స్థానం..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లిది ప్రత్యేక స్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫిట్‌నెస్‌లోనూ అతను అందరికీ ఆదర్శమే. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం నిర్వహించే యోయో టెస్టులో విరాట్ సహచర ఆటగాళ్లకు అందనంత ఎత్తులో నిలిచి మరోసారి సంచలనం సృష్టించాడు. కోహ్లి 17.2 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో కోహ్లి ఫిట్‌నెస్ మంత్రం మరోసారి చర్చలోకి వచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో కోహ్లి ఏనాడు కూడా ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొలేదు. 35 ఏళ్ల కోహ్లి ఇప్పటికీ యువ క్రికెటర్ల కంటే ఎంతో మెరుగైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉండడం గమనార్హం. రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి ఫిట్‌నెస్‌లోనే ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరుగుల రారాజుగా పేరున్న కోహ్లి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఆటగాళ్లతో పోటీ పడి మైదానంలో పరిగెత్తుతాడు. సాధనలో కూడా అందరికంటే ముందుటాడు.

ఇప్పటికే క్రికెట్‌లో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తయినా కోహ్లిలో ఎలాంటి అలసట కనిపించడం లేదు. మూడు ఫార్మాట్‌లలోనూ అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఐపిఎల్‌తో సహా వన్డే, టెస్టుల్లోనూ నిలకడైన ప్రదర్శనతో అలరిస్తున్నాడు. కోహ్లి ఈ స్థాయిలో ఉన్నాడంటే అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లి ఫిట్‌నెస్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఫిట్‌నెస్‌కు పోటీ వచ్చే క్రికెటర్ కనుచూపు మెరలో కనిపించడం లేదు. ఆసియాకప్ కోసం ఇటీవల బిసిసిఐ భారత క్రికెటర్లకు యోయో ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించింది. ఈ టెస్టులో చాలా మంది క్రికెటర్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే కోహ్లి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా టెస్టులో నెగ్గాడు. ఈ క్రమంలో ఏకంగా 17.2 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి తనకు ఎదురులేదని నిరూపించాడు.

కఠినమైన ఆహార నియమాల వల్లే..
విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌లో అందరి కంటే ముందంజలో ఉండడంలో అతను పాఠించే కఠినమైన ఆహార నియామలే ప్రధాన కారణం అని చెప్పాలి. ఇతర క్రికెటర్లతో పోల్చితే కోహ్లి కఠినమైన డైట్‌ను పాటిస్తాడు. ప్రతి రోజునూ కోహ్లి మొదటి రోజుగానే భావిస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తాడు. వ్యాయామం అయినా, ఆహార నియమాలైనా మళ్లీ కొత్తగానే మొదలు పెడుతాడు. అలసటను దరిచేరనియ్యకుండా చూస్తాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, తీరిక లేని షెడ్యూల్ ఉన్నా కోహ్లి ఫిట్‌నెస్ ఏనాడు నిర్లక్షం చేయడు. ఫిట్‌నెస్ కోసం కోహ్లి తన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. దీని కోసం తనకు ఎంతో ఇష్టమైన చికెన్‌ను సయితం పూర్తిగా దూరం పెట్టేశాడు. ప్రస్తుతం కోహ్లి పూర్తి శాకాహారిగా మారిపోయాడు. మసాల వంటకాలను దగ్గరికి రానివ్వడు. అంతేగాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మినరల్ వాటర్‌ను వాడుతాడు.

తాజా కూరగాయలు, పప్పు, గుడ్లను మాత్రమే ఆహారంగా మార్చుకున్నాడు. ఉదయం బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటాడు. వీటితో పాటు పాలకూర, పనీర్ సలాడ్, ఎండుమిర్చిలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాడు. మధ్యాహ్న భోజనంలో నట్స్, బ్రౌన్ బ్రెడ్ మాత్రమే తింటాడు. ప్రొటీస్ షేక్‌ను తాగుతాడు. రాత్రి భోజనంలో రోటీ, పప్పు, ఆకు కూరలతో కూడిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటాడు. మరోవైపు శరీరాన్ని డీహైడ్రేడ్ కాకుండా చూసుకునేందుకు బ్లాక్ వాటర్‌నే తాగుతాడు. ఈ నీళ్ల బాటిల్‌కు అత్యంత ఖరీదైనదిగా పేరుంది. ఈ బాటిల్ నీళ్ల ధర నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది. ఆహారంతో పాటు వ్యాయామం విషయంలో కూడా కోహ్లి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇలా ఫిట్‌నెస్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కోహ్లి 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ కూడా గాయాల బారిన పడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News