పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించింది. ఐతే ఇప్పుడా విడుదల తేది మరింత ముందుకు వచ్చింది. విరాట పర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది. ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.