అహ్మదాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దాదాపు 1200 రోజులుగా మోస్తున్న బరువును దించుకున్నాడు. వన్డేలు, టి20 సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరును సాధించడానికి దాదాపు మూడున్నరేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా ఆసీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టుమ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. విరాట్‌కిది టెస్టుల్లో 28వ సెంచరీ కాగా అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తంగా 75వ సెంచరీ. సచిన్ తెండూల్కర్ వంద సెంచరీల రికార్డును చేరుకోవాలంటే మరో 25 సెంచరీలు చేయాలి.
సచిన్ 664 మ్యాచ్‌లు ఆడగా కోహ్లీ ఇప్పటివరకు 493 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మ్యాచ్ ఆరంభంనుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన విరాట్ కోహ్లీ 241 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.2019 నవంబర్ 12న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీకి మరో సెంచరీ చేయడానికి దాదాపు 1200 రోజుల సమయం పట్టింది. దీనికోసం 41 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకోవడం గమనార్హం. అంతేకాదు తన కెరీర్‌లో ఎక్కువ బంతులు తీసుకుని మరీ సెంచరీ చేయడం ఇది రెండో సారి. ఇప్పుడు ఆసీస్‌పై 241 బంతుల్లో శతకం చేయగా, గతంలో ఇంగ్లాండ్‌పై 289 బాల్స్ తీసుకున్నాడు.