వీరేంద్ర సెహ్వాగ్
ముంబై: చిన్నప్పటి నుంచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను టివిల్లో చూసి అనుకరించేవాడినని భారత స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. సచిన్‌లాగే షాట్లు ఆడేందుకు ఇష్టపడే వాడినని వివరించాడు. మాస్టర్ కొట్టినట్టు స్ట్రెయిట్ డ్రైవ్‌లు, బ్యాట్‌ఫుట్ పంచ్ షాట్‌లు ఆడేందుకు ప్రయత్నించేవాడినని తెలిపాడు. ఇలా సచిన్‌ను అనుకరించడం తనకు ఎంతో కలిసి వచ్చిందన్నాడు. ఇక క్రికెట్‌లో తనకు సచినే ఆదర్శమన్నాడు. మాస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకునే తాను క్రికెట్‌లో ముందుకు దూసుకెళ్లానని స్పష్టం చేశాడు. ఇక తాను క్రికెట్ కెరీర్ ఆరంభించిన సమయంలో ఇప్పట్లా సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కాదన్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధంగా అప్పట్లో క్రికెట్ వీడియోలు, యాప్‌లు అందుబాటులో ఉండేవి కావన్నాడు. ఒకవేళ యాప్‌లు, వీడియోలు అందుబాటులో ఉంటే మరింత ముందుగానే టీమిండియాకు ఆడేవాడినని సెహ్వాగ్ పేర్కొన్నాడు. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి సెహ్వాగ్ క్రికెట్ యాప్‌ను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలు వెల్లడించాడు.