Tuesday, January 21, 2025

కెసిఆర్ దార్శనికతకు ప్రపంచమే ఫిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సామాజిక సమానత్వ దార్శనికత.. దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తలనుంచి ప్రశంసలను అందుకుంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. భారత రాజ్యాంగాన్ని రూపొందించి సర్వమానవ సమానత్వాన్ని ఆకాంక్షించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్పూర్తిని కొనసాగించే దిశగా, ఆయన ఆశయాలను నిజం చేస్తూ సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సామాజిక ఆర్థిక ప్రగతి కార్యాచరణ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నది. ఇందులో భాగంగా…యు.కెకు చెందిన పార్లమెంటు మెంబర్ (ఎంపి) ముఖ్యమంత్రి కెసిఆర్ మహోన్నత దార్శనికతను కొనియాడుతూ స్వయంగా లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. యు.కెలోని సౌతాల్ ఈలింగ్ నుంచి పార్లమెంటు సభ్యుడుగా ప్రస్తుతం పనిచేస్తున్న బ్రిటీష్ ఇండియన్ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్ రాజకీయ నాయకుడు వీరేంద్ర శర్మ… ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఈ మెయిల్ ద్వారా అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు.

లేఖ సారాంశం వీరేంద్ర శర్మ మాటల్లోనే..

“డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మహా విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించడం గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. డా.అంబేద్కర్ పుట్టుక, వారు చేసిన కృషి, వారి చరిత్రే భారత దేశం గురించి వివరిస్తుంది. అటు యు.కెలోనూ ఇటు ఇండియాలోనూ నాటి పరిస్థితుల్లో అంబేద్కర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం వారి పట్టుదల, వారి ఆలోచనలు, కార్యాచరణ, విరామమెరుగని వారి రచనావ్యాసంగం మహోన్నతమైనవి. నాడు కొనసాగుతున్న కాలం చెల్లిన సాంప్రదాయ మూసధోరణులను పక్కకుతోసి, ఎటువంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాలను, సమానత్వంతో కూడిన సమ్మిళితాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, బహుళత్వం దిశగా సమాజాన్ని నడిపించేందుకు.. వారి ఆలోచనలకు రూపమిచ్చి నవీన భారత రాజ్యాంగాన్ని డా. బిఆర్.అంబేద్కర్ రూపొందించించారు.

భారత రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడుగా భారత దేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగ్యాన్ని నిర్మించారు.భవిష్యత్తు తరాల కోసం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికతను మనం ఇంకా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నం. మూఢ విశ్వాసాలకు తావులేకుండా, భారత ప్రజల అభివృద్ధే ధ్యేయంగా వారు రాజ్యాంగాన్ని రచించారు. యు.కె లోని తెలంగాణకు చెందిన సామాజిక సంస్థలతో కలిసి పనిచేయడం నాకు గర్వంగా భావిస్తున్నాను.” అని తన లేఖలో తెలిపారు.“మిమ్మల్ని యు.కెలో త్వరలోనే చూడాలనుకుంటున్నాము… మీ స్పూర్తిదాయక ప్రసంగాన్ని వినాలని కోరుకుంటున్నాము.” అని పేర్కొంటూ వీరేంద్ర శర్మ తన లేఖను ముగించారు.

చిన్నతనంలోనే యుకెకు వలస వెళ్లిన వీరేంద్ర శర్మ

పంజాబ్‌కు చెందిన 76 ఏండ్ల వీరేంద్ర శర్మ తన చిన్ననాడే య.కెకు వలస వెళ్లారు. జీవన భృతికోసం అక్కడ బస్ కండక్టరుగా ఉద్యోగం కూడా చేశారు. తర్వాతి కాలంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను కూడా అభ్యసించిన వీరేంద్ర శర్మ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాదరణ పొందుతూ అంచెలంచలుగా ఎదుగుతూ లేబర్ పార్టీ తరఫున 2007లో ఎంపిగా గెలిచి యు.కె సౌతాల్ ఈలింగ్ నుంచి పార్లమెంటు సభ్యునిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

ముఖ్యమంత్రి రాజకీయ సామాజిక విధానాలకు ప్రపంచమే ఫిదా…

దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల ప్రజలు,నాయకులు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ సామాజిక విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. తమ కోసం ఒకసారి వచ్చి అక్కడి ప్రజలకు సిఎం కెసిఆర్ ప్రసంగాలను, సందేశాన్నిచ్చిపోవాలని వారు కోరుతున్నారు. అందుకు వీరేంద్ర శర్మ లేఖనే సాక్ష్యంగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News