న్యూఢిల్లీ: మృతదేహంపై ఎటువంటి కోతలు లేకుండా, మరణానికి కారణాన్ని మరింత కచ్ఛితత్వంతో తెలుసుకునేందుకు వీలు కల్పించే వర్చువల్ అటాప్సీ సౌకర్యాన్ని ఇక్కడి అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లో శనివారం ప్రారంభించారు. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఈ నూతన సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ మరణించిన వ్యక్తి దేహం పట్ల గౌరవపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందని చెప్పారు. పోస్ట్‌మార్టమ్‌కు వచ్చిన మృతదేహంపై ఇక ఎటువంటి కోతలు ఉండవని, శరీరంలోని ఇతర అవయవాల పరిస్థితి ఏమిటి, వ్యక్తి మరణానికి దారితీసిన కారణాలేమిటి వంటి అంశాలతోపాటు పరిశోధనకు ఉపయోగపడే అనేక విషయాలు ఈ నూతన విధానంలో తెలుసుకోగలుగుతామని ఆయన చెప్పారు.
మృతదేహానికి నేరుగా పోస్ట్‌మార్టమ్ చేయడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని, కాని వర్చువల్ అటాప్సీ ద్వారా 10 నిమిషాలలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అతి తక్కువ సమయంలోనే అందచేయవచ్చని ఆయన చెప్పారు. వర్చువల్ అటాప్సీని స్కానింగ్, ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా నిర్వహిస్తారు. సిటి స్కానింగ్ మిషన్ ద్వారా మృతదేహానికి చెందిన అవయవాలను, కణజాలాన్ని అధ్యయనం చేస్తారు. సిటి స్కాన్ యంత్రంలో మృతదేహాన్ని ఉంచిన కొద్ది క్షణాల్లోనే దాదాపు 25,000 ఇమేజెస్‌ను అది తీయగలదు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా మరణానికి కారణాన్ని నిపుణులు నిర్ధారిస్తారు.