Monday, January 20, 2025

హైదరాబాద్ లో అంతు చిక్కని వైరస్ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః గ్రేటర్ నగరంలో మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తక్కువ ఆక్సిజన్ లెవల్స్ వంటి లక్షణాలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనిని మొదట స్వైన్‌ప్లూ , కోవిడ్ 19 కేసులుగా భావించి పరీక్షలు నిర్వహించారు. కానీ ఈ రెండు పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు రావడంతో ఇంతకూ ఈ వైరస్ ఏమిటన్నది అంతుపట్టడం లేదు. 100 డిగ్రీల ఫారెన్ హీట్‌కు మించిన జ్వరం ఆగకుండా వచ్చే దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పలు, నీరసం, తలనొప్పి, చలి జ్వరం,ముక్కు కారడం ఈ వ్యాధి లక్షణాలు పెద్దలు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్రంగా ఉంటుందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. రెండు మూడు నెలలుగా ఇలాంటి లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి ఈ రకం కేసులు తక్కువగా ఉన్నాయని వైద్యాధికారులు అంటున్నారు. ఇలా వచ్చిన వారు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో స్వైన్ ప్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ లో తక్కువగానే ఉంది. కానీ స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్న వారిలో ఈ కొత్త రకం వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈవైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆప్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని ఫీవర్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. గత పదిరోజుల నుంచి వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులు కిక్కిరిసిపోతున్నారు.

కొద్దిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి, ఆ తర్వాత వర్షం ఆగింది. ఈ కారణంగా వాతావరణంలో మార్పులతో దోమలు విజృంభణతో డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాప్తిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈలక్షణాలున్న వారు జన సమూహంలో సంచరించవద్దని, బయటకు వెళ్లితే ముఖానికి తప్పకుండా మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తే మంచిదని ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు సూచిస్తున్నారు. ఈవ్యాధితో బాధపడేవారు నీరసంగా ఉంటారని, సమయానికి బలమైన ఆహారం తీసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొంటున్నారు. చల్లటి పానీయాలు, మద్యపానం సేవించరాదని, వైద్యుల సలహాల మేరకు మందులు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News