లండన్ : దీర్ఘకాల కొవిడ్ బాధితుల్లో వైరస్ తీవ్ర ప్రభావంతో వారి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాససంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని లండన్ యూనివర్శిటీకి చెందిన యూసిఎఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ అండ్ హెల్త్ విభాగం లోని వైద్యుల బృందం అధ్యయనం వెల్లడించింది. అధ్యయనం వివరాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్‌ఐహెచ్‌ఆర్) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఈ అధ్యయనంలో దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడిన 3750 మంది రోగులపై పరిశోధనలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగోస్థాయిలో ఉన్న బాధితుడి అనారోగ్యం కంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోందని తేలింది.
కొవిడ్ నుంచి కోలుకున్న తరువాత రోగుల ఆరోగ్యంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న దానిపై ఈ వైద్యబృందం పరిశోధించింది. దీనికోసం ఓ డిజిటల్ యాప్‌ను రూపొందించారు. తమకు కావలసిన సమాధానాలు రాబట్టుకోడానికి తగిన ప్రశ్నలను తయారు చేసి అందులో పొందుపరిచారు. అలసట నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం తదితర అంశాలపై ప్రశ్నలకు దీర్ఘకాల కొవిడ్ బాధితుల నుంచి సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతగా అలసట అనుభవిస్తాడో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు రుజువైంది. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసిన వారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు వారే.
కొవిడ్ బాధితులమైన తరువాత ఇదివరకులా పనిచేయ లేక పోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా తమ వివరాలు తెలియజేసిన కొవిడ్ బాధితుల్లో 71 శాతం మంది మహిళలే కావడం గమనించదగిన విషయం. దీర్ఘకాల కొడిడ్ తీవ్ర ప్రభావం వల్ల రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ హెన్రీ గుడ్‌ఫెలో వెల్లడించారు