వాషింగ్టన్ : హెచ్1బి గెస్ట్ వర్కర్స్ వీసాపై రెండు పక్షాల వాదనను ఇష్టపడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాకు‘అత్యంత సమర్థులైన’,‘ఘనులైన’ వ్యక్తుల అవసరం ఉందని. అది ఈ వీసా కార్యక్రమం ద్వారా సాధ్యం అవుతుందని ట్రంప్ తెలిపారు. తాను కూడ హెచ్1బి వీసా కార్యక్రమాన్ని వినియోగించుకున్నానని ట్రంప్ తెలియజేశారు. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రత్యేక ఉద్యోగాల్లో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యుఎస్ కంపెనీలను అనుమతించే నాన్ ఇమ్మిగ్రంట్ వీసా హెచ్1బి వీసా. భారత్, చైనా వంటి దేశాలనుంచి ఏటా అనేక వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ సంస్థలు ఆ వీసాపైనే ఆధారపడుతుంటాయి.
‘నాకు రెండు వైపుల వాదనలు ఇష్టం. అయితే, శిక్షణ గరపడంతో ముడిపడి ఉన్నప్పటికీ, తమ వంటి అర్హతలు లేని ఇతరులకు సాయం చేయవలసి వచ్చినప్పటికీ అత్యంత సమర్ధులైనవారు మా దేశంలోకి రావడాన్ని కూడా ఇష్టపడతాను. అయితే, దానిని ఆపాలని నేను కోరుకోవడం లేదు& ఇంజనీర్ల గురించే నేను మాట్లాడడం లేదు, అన్ని స్థాయిల్లోని వారి గురించే మాట్లాడుతున్నాను’ అని ట్రంప్ మంగళవారం చెప్పారు. ఒరాకిల్ సిటిఒ లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సోన్, ఓపెన్ ఎఐ సిఇఒ శామ్ ఆల్ట్‌మన్‌లతో కలసి వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారుల్లోనే హెచ్1బి వీసాపై ప్రస్తుతం సాగుతున్న చర్చపై ఒక ప్రశ్నకు అధ్యక్షుడు అలా సమాధానం ఇచ్చారు.
భారతీయులు ప్రపంచం అంతటి నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులను, మేధావులను తీసుకువచ్చే హెచ్1బి వీసాల ప్రధాన లబ్ధిదారులు. భారత్ నుంచి అత్యంత వృత్తి నిపుణులు అత్యధిక సంఖ్యలో హెచ్1బి వీసాలు పొందుతుంటారు. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ వంటి ట్రంప్ సన్నిహిత నమ్మకస్థులు హెచ్1బి వీసాలను సమర్థిస్తుండగా, ఆయన మద్దతుదారుల్లో అనేక మంది అది అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తోందని వాదిస్తున్నారు. అత్యంత వృత్తి నిపుణుల కోసం ఉద్దేశించిన విదేశీ గెస్ట్ వర్కర్స్ వీసాలు హెచ్1బిపై చర్చ డిసెంబర్ నుంచి ఉద్ధృతమైంది. అది డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండింటిలో చీలికలను సృష్టించింది. నిపుణులైన వలసవాదులకు గ్రీన్ కార్డులపై పరిమితుల తొలగింపు అంశాన్ని మస్క్ పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ విధాన సలహాదారు పదవికి ట్రంప్ ఎంపిక అయిన శ్రీరామ్ కృష్ణన్ క్రితం నెల చేసిన ఒక వ్యాఖ్య ఆ చర్చకు దారి తీసినట్లు కనిపిస్తోంది.