అమరావతి: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు మూడు రోజులపాటు తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం(14వ తేదీ) ఉదయం తిరుపతికి చేరుకుంటారు. ఉదయం 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి నేరుగా శ్రీకాళహస్తి వెళ్లనున్నారు. కాళహస్తీశ్వర స్వామి దర్శనానంతరం తిరుపతి వచ్చి తాతయ్యగుంటలో గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. గంగమ్మ జాతరలో పాల్గొన్న తర్వాత తిరుమలలోని విశాఖ శారదాపీఠం ఆశ్రమానికి వెళతారు. ఆదివారం (15వ తేదీ) ఉదయం తిరుచానూరు వెళ్ళి పద్మావతీ అమ్మవారిని దర్శిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని ధర్మప్రచార పరిషత్ అధికారులు, పండితులతో విశాఖ శారదాపీఠం తిరుమల ఆశ్రమంలో మాట్లాడతారు. సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించనున్న తరిగొండ వెంగమాంబ జయంత్యుత్సవాలకు హాజరవుతారు. సోమవారం 16వ తేదీ ఉదయం 10గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని విశాఖకు తిరుగుపయనమవుతారు. 16వ తేదీ మధ్యాహ్నం వరకు పీఠాధిపతుల పర్యటన కొనసాగుతుంది