విశాఖపట్నం: నష్టాలపేరుతో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి ఓ వైపు కేంద్రం ప్రయత్నిస్తుంటే మరో వైపు కార్మికులు చెమటోడ్చి సంస్థను లాభాల బాటలోకి తెచ్చారు. సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తూనే మరోవైపు పట్టుదలతో పని చేసి రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేశారు. సమష్టి కృషి ఫలితంగా ఆరేళ్ల తర్వాత విశాఖ ఉక్కు లాభాల బాటలో పయనిస్తోంది. అమ్మకాల్లో 57 శాతం వృద్ధి సాధించినట్లు విశాఖ ఉక్కుపరిశ్రమ సిఎండి అతుల్ భట్ శనివారం వెల్లడించారు. 2021-22లో పన్నుకు ముందు రూ.835 కోట్ల లాభం వచ్చిందని,ప్రస్తుతం కార్మికుల సమష్టి కృషితో సూచికల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పారు.2020-21లో రూ.17,978 కోట్ల అమ్మకాలు,2021-22లో రూ.28,245 కోట్ల అమ్మకాలు,2022 మార్చిలో రూ.3,685 కోట్ల ఉక్కు విక్రయించినట్లు ఆయన చెప్పారు. 2బ్లాస్ట్ ఫర్నేస్‌లలో రికార్డుస్థాయి ఉత్పత్తి సాధించామన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు, సిబ్బంది, అధికారులకు సిఎండి అభినందనలు తెలిపారు.