హైదరాబాద్: తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయానని నటుడు మంచు విష్ణు తెలిపారు. తన కుటుంబంలో సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని, మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన దాడి కాదని మంచు విష్ణు తెలిపారు. మంచు కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. మా ఇంట్లో గోడవలు పెద్దదిగా చేసి చూపించవద్దని మీడియాను మంచు విష్ణు కోరారు. కుటుంబ వివాదం గురించి తాను ఏమీ మాట్లాడనని, చిన్నవాడు అవగాహన లేకుండా మాట్లాడి ఉండొచ్చని, తాను మాత్రం అలా మాట్లాడలేనని, తాను ఉండి ఉంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదన్నారు. మా ముగ్గురిని అతిగా ప్రేమించడమే మా డాడీ చేసిన తప్పు అని, ఇప్పుడు మనస్పర్థలు రావడంతోనే గొడవలు జరుగుతున్నాయన్నారు.
ఆస్తులన్నీ నాన్న స్వార్జితం వాటిపై హక్కు ఆయనకే ఉందని, తనకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టమని, కొందరికి చిన్న కుటుంబం అంటే ఇష్టం ఉంటుందని, ఇంట్లో ఉండొద్దని నాన్న అంటే ఆ మాటకు గౌరవమివ్వాలన్నారు. పోలీసుల నోటీసులు తమకు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని, గన్ సరెండర్ చేయాలని మంగళవారమే ఆదేశించినట్లు మీడియాలో వచ్చిందని విష్ణు పేర్కొన్నారు. గన్ సరెండర్ పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు నోటీసులు ఇచ్చారని, విచారణకు రావాలని ఉదయం 9.30 గంటలకు నోటీసు వచ్చిందన్నారు. ఉదయం 9.30 గంటలకు నోటీసు ఇచ్చి 10.30 గంటలకు విచారణకు రమ్మంటే ఎలా వస్తామని అడిగారు. ఏ ప్రాతిపదికన తనకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు దేశంలోనే లేను అని, తనకెలా నోటీసులు ఎలా ఇస్తారన్నారు. సిపిని కలవాల్సిన అవసరం తనకు లేదని, అయినా కలుస్తానని విష్ణు స్పష్టం చేశారు.