Monday, December 23, 2024

విష్ణు పద వ్యాసాలు

- Advertisement -
- Advertisement -

వరంగల్లు తెలుగును టక్సాలి తెలుగు అంటారు సామల సదాశివ. టంకశాలలో తయారు చేయబడిన నాణెం వలె వరంగల్లు తెలుగు భాష ఒరిజినాలిటీ కలిగి ఉంటుందని ఆయన అభిప్రాయం. వరంగల్లు తెలుగును, అక్కడి మాండలికపు మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే డాక్టర్ టి శ్రీరంగ స్వామి విష్ణు పద వ్యాసాలను చదవాల్సిందే. శ్రీరంగ స్వామి ఓరుగల్లు కు చెందిన సుప్రసిద్ధ కవి, విమర్శకులు. బహు గ్రంథకర్త. తెలుగు విమర్శరంగంలో తనదైన పథం లో సాగుతున్నారు.
ఒక ప్రాంతపు భాష గురించి అధ్యయనం చేయాలంటే ఆ ప్రాంతపు చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. వరంగల్లు ప్రాంతపు భాషను గురించి శ్రీరంగ స్వామి రాసిన వ్యాసంలో ఈ కోణాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులతో పాటు పాలించిన మేడారం గిరిజన రాజులు, కొరవి ప్రాంతాన్ని పరిపాలించిన శాలివాహన రాజులు, కాకతీయుల అనంతరం వచ్చిన మహమ్మదీయ రాజుల భాష ఈ ప్రాంత భాషను మాండలికాన్ని ప్రభావితం చేసింది అని సాధికారికంగా నిరూపిస్తారు. సాంస్కృతికపరంగా చూసినప్పుడు తెలుగు సాహిత్యంలోనే పేరెన్నిక గన్న బసవపురాణం భాగవతం లాంటి గొప్ప కావ్యాలు ఓరుగల్లు నేల నుండి ఉద్భవించాయి. పేరిణి వంటి గొప్ప నృత్య రీతి ఇక్కడే ఆవిర్భవించింది. ఇట్లాంటి సాంస్కృతిక సాహిత్య పరమైన నేపథ్యం కూడా ఇక్కడి భాష పై ప్రభావితం చేసిందంటారు శ్రీరంగస్వామి. నైసర్గికంగా చూసినప్పుడు వరంగల్లో సరిహద్దు జిల్లాల ప్రభావం ఈ ప్రాంతపు భాష పై ఉంది అంటారు. ఇట్లా ఒక ప్రాంతపు భాషను అంచనా వేసే క్రమంలో శ్రీరంగ స్వామి శాస్త్రీయ దృష్టి కనిపిస్తున్నది. ఈ ప్రాంతపు ఉర్దూ పదాలు, వ్యవసాయ సంబంధ సామెతలు, సాధారణ జనవ్యవహారంలో ఉన్న సామెతలు, పలుకుబడులను సోదాహరణంగా వివరించారు.

తెలంగాణ భాష ఔన్నత్యాన్ని ప్రకటించే మరొక వ్యాసం ’తెలంగాణ మాండలికం ఒక అవలోకనం ’ ఇది కూడా గొప్ప పరిశోధనాత్మక వ్యాసం. జీవద్భాషలో ఏదైనా గుర్తుంచుకోవడం సులభమని, పండిత పామరుల జన వ్యవహారాలలో జీవద్భాష మమేకమైపోయిందని ఈ వ్యాసంలో వివరించారు. తెలంగాణ మాండలికము ఒక లయాత్మకంగా మారిన వైనాన్ని ఉదాహరణలతో తెలియజేశారు. కొన్ని పదాలకు పూర్ణానుస్వారాలు చేరడం ద్వారా ఒక ఊపు తూగు వస్తున్న వైనం ఉదాహరణలతో తెలియజేశారు. పోతన తెలగన వంటి ప్రాచీన కవులతో పాటు వానమామలై వరదాచార్యులు వంటి ఆధునిక కవుల వరకు జీవద్భాషను తమ కవిత్వంలో అలవోకగా ఉపయోగించిన వైనాన్ని వివరించారు.

తెలంగాణ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని సాహిత్యపు వైభవాన్ని చాటిన మరొక పరిశోధనాత్మక వ్యాసం ’ఉత్తర గోదావరి పరివాహక సాహిత్యం’. బోధన్ నుండి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతం సాహిత్య పరంగా సుసంపన్నమైనది. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం కనుమరుగైన ఈ చరిత్రను వెలుగులోకి తేవడానికి జరిగిన పరిశోధనాత్మక కృషిలో శ్రీరంగ స్వామి కాంట్రిబ్యూషన్ ను ఈ వ్యాసం ప్రతిఫలిస్తుంది. తొలి తెలుగు శాసనకర్త జిన వల్లభుడు, ఉత్తర రామ చరిత రాసిన భవభూతి,కన్నడ ఆదికవి పంపకవి, సింహాసన ద్వాత్రింశిక కర్త కొరివి గోపరాజు, ధర్మపురి కాకుత్సం శేషప్ప కవి మొదలు భద్రాచలం రామదాసు వరకు గోదావరి తీరంలోని ప్రాచీన కవులందరినీ ఈ వ్యాసంలో స్పర్శించారు. వారు ఆయా ప్రాంతాలకే చెందినవారు అనడానికి కావలసిన రుజువులు చూపించారు. అలాగే ఆధునిక కాలంలో బాసర క్షేత్రంలో సరస్వతీ దీక్షను స్వీకరించిన అష్టకాల నరసింహ శర్మ మొదలు భద్రాచలంలో పండితురాలు చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ వరకు ఆధునిక కవులను కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రాచీన ఆధునిక కవుల ప్రస్తావనతో ఈ వ్యాసానికి సమగ్రత చేకూరింది.

వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి వాస్తవ్యులు ఒద్దిరాజు సోదరులు తెలంగాణ సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధులు. సాహిత్య పరంగా, పత్రికా రచన పరంగా, గ్రంథాలయ ఉద్యమ పరంగా, సంస్కర్తలుగా వారి బహుముఖీనమైన కృషిని ఆవిష్కరించిన వ్యాసం ’ నవ భాషా కోవిదులు ఒద్దిరాజు సోదరులు ’. ఈ వ్యాసం ద్వారా తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి ఒద్దిరాజు సోదరులు చేసిన మేలును సమగ్రంగా చిత్రించారు. బహుభాషా కోవిదులుగా ఒద్దిరాజు సోదరులను సప్రమాణంగా నిరూపించిన వ్యాసం ఇది. వారి అముద్రిత రచనలను కూడా సంపాదించి అందులోని విశేషాలను వివరించారు. ఇది శ్రీరంగ స్వామి పరిశోధన పటిమకు నిదర్శనం. ఒద్దిరాజు సోదరులను అధ్యయనం చేయాలనుకునే వారికి దిక్సూచి లాంటి వ్యాసం ఇది.

కాళోజీ రామేశ్వరరావు, కాళోజి నారాయణరావు లు కాళోజీ సోదరులుగా సుప్రసిద్ధులు. కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి. షాద్ కలం పేరుతో సుప్రసిద్ధులు. కాళోజీ సోదరులలో కాళోజీ నారాయణరావు గురించి సాహిత్య లోకానికి పరిచయం ఉన్నంతగా కాళోజి రామేశ్వరరావు గురించి తెలియదు అనేది వాస్తవం. ‘కాళోజీ రామేశ్వరరావు’ షాద్’ ‘ అనే వ్యాసం తెలుగు సాహిత్యంలో ఈ లోటును కొంత తీర్చింది అని చెప్పవచ్చు. కాళోజీ రామేశ్వరరావు కవిత్వానికి రావలసినంత గుర్తింపు రాలేదని శ్రీరంగస్వామి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. తెలుగు ఉర్దూ హిందీ సాహిత్యంలో గొప్ప సృజనను అందించిన రామేశ్వరరావు కేవలం సాహితీవేత్తగానే కాక న్యాయవాదిగా, సంస్కరణ శీలిగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకుడిగా అనేక రంగాలలో తన కృషిని విస్తరించారు. రామేశ్వరరావు సాహిత్య సౌందర్యాన్ని శ్రీరంగస్వామి ఈ వ్యాసంలో ఉదాహరణలతో చక్కగా ఆవిష్కరించారు. వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని తెలియజెప్పడం ఈనాటి తరానికి స్ఫూర్తివంతంగా ఉంది.

దాశరథి సోదరులలో ఒకరు గద్య దాశరథిగా ప్రసిద్ధికెక్కిన దాశరధి రంగాచార్యులు రాసిన నవల ’రానున్నది ఏది నిజం?’. ఈ నవలపై శ్రీరంగ స్వామి రాసిన విశ్లేషణ వైవిధ్యాన్ని సంతరించుకుంది. 1973 ప్రాంతంలో వ్రాసిన నవల 2020 కాలము నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు దాశరథి రంగాచార్య దార్శనిక దృష్టిని ఈ వ్యాసంలో ప్రతిఫలించారు. ఈనాటి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ అస్తిత్వం కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఆనాడే రచయిత ఊహించి రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రీరంగ స్వామి రాసిన ఈ వ్యాసం చదివిన తర్వాత పాఠకుడికి మూల గ్రంథం చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది.

విశ్వనాథ సత్యనారాయణ కేదార గౌళ ఖండ కావ్య సంపుటిలోని వస్తు వైవిధ్యాన్ని, చందో వైవిధ్యాన్ని, విశ్వనాథ పద ప్రయోగాలను పరిశోధనాత్మక దృక్పథంతో తెలియజేశారు. ప్రముఖ సాహితీవేత్త విహారి తాను రాసిన కిష్కింద కాండం ఫై శ్రీరంగస్వామి చక్కని విశ్లేషణ అందించారు. వాల్మీకి రామాయణం లోని ఘట్టాలను విహారి తనదైన శైలిలో ఆవిష్కరించిన వైనాన్ని తెలియజేశారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని ఘట్టాలతో తులనాత్మకంగా అధ్యయనం చేశారు. విహారి ఉపయోగించిన అనేక విశేష చందస్సులను గురించి తెలియజేశారు. ఆయా సందర్భానుసారం వాడిన జాతీయాలు సామెతలు నుడికారాలను వివరించారు.

పరిశోధనా దృక్పథం ఉన్న రచయిత తప్ప వేరొకరు ఈ వ్యాసం రాయలేరు. కాళోజీ వ్యక్తిత్వాన్ని సాహిత్యాన్ని ఆవిష్కరించిన వ్యాసం ’ కాళోజీ కవిత్వం – అధిక్షేపం ’ ఈ వ్యాసం ద్వారా కాళోజీ ధిక్కార ధోరణి, అన్యాయాన్ని ఎదిరించే నైజం, కాళోజీ కవిత్వం ద్వారా నిరూపించారు. తెలంగాణ కవిత్వంలో అస్తిత్వ వాదాన్ని రుజువు పరిచే ప్రయత్నం విష్ణు పద వ్యాసాలలో కనిపిస్తుంది. పాల్కురికి సోమనాథుడు, పోతన కవిత్వం నుండి నేటి వరకు కవుల రచనల్లో ఉండే అస్తిత్వం మూలాలను శోధించిన వ్యాసం ఇది. సాంస్కృతిక చారిత్రక అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తెలియ చెప్పారు. ఆత్మకథలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయని ఆత్మకథలు సమాజ ప్రతిబింబాలు అనే వ్యాసంలో పేర్కొన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే కొన్ని ఆత్మ కథలలోని ఉదాహరణలను ఈ వ్యాసంలోస్థూలంగా వివరించారు.తెలుగు సాహిత్యం గర్వించదగ్గ విద్వన్మూర్తి కోవెల సంపత్ కుమార. శ్రీరంగ స్వామి గారి పరిశోధనా మార్గదర్శి. వారితో ప్రత్యక్ష అనుభవాలను విష్ణు పద వ్యాస సంపుటిలో చివరగా పాఠకులతో పంచుకున్నారు. పాండిత్యం, సౌజన్యం, ఆర్ద్రత, ఆత్మీయత మూర్తిభవించిన వ్యక్తిగా సంపత్ కుమార వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని దశదిశలా చాటే వ్యాసం ఇది.

విష్ణుపదలో 12 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలన్నీ పరిశోధనాత్మక దృక్పథంతోనే సాగాయి. నేటి తరం విమర్శకులకు పరిశోధకులకు ఈ వ్యాసాలు మార్గదర్శనం చేయగలవు. తెలంగాణ సాహిత్యపు లోతులను తెలుసుకునే పరిశోధనలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ వ్యాసాలు తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప చేర్పు.

సాగర్ల సత్తయ్య
7989117415

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News