మంచు కుటుంబ గొడవలు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మంచు మనోజ్‌పై దాడి కేసులో అతని అన్న మంచు విష్ణు ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం పహడీషరీఫ్ పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. నగర శివారులోని జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి మనోజ్ ను రాకుండా గేట్లు క్లోజ్ చేయడంతో.. ఆయన గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈక్రమంలోనే కవరేజ్ కు వెళ్లిన ఓ జర్నలిస్ట్ పై మోహన్ బాబు ఆగ్రహంతో మైక్ తీసుకొని కొట్టాడు. దీంతో ఆయనపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ దాడిపై పోలీసులు ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. అయితే, నిన్న జరిగిన ఉద్రిక్తతతో స్వల్ప ఆస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.