Monday, December 23, 2024

విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం జ్ఞానాలయంగా వెలుగొందాలి

- Advertisement -
- Advertisement -

విశ్వకర్మ జయంతోత్సవ సభలో విశ్వకర్మ నేతల ఆకాంక్ష
ఆత్మగౌరవ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మధుసూధనాచారి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని విశ్వకర్మీయుల ఔన్నత్యం కోసం, ఆ జాతి ఉన్నతి కోసం విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవభవనం జ్ఞానాలయంగా నిలిచిపోవాలని విశ్వకర్మ జాతికి చెందిన పలువురు ప్రముఖులు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్వకర్మ జాతి కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టినందుకు విశ్వకర్మ జాతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, జేజేలు పలుకుతున్నామని చెప్పారు. విశ్వకర్మ జాతి అభివృద్ధికి నిరంతరం కృషిచేసే నైపుణ్యాలను అందించే సాంకేతిక జ్ఞాన నిలయంగా విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం నిలిచిపోవాలని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, తెలంగాణ బిసి కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బిసి కమిషన్ సభ్యులు ఉపేంద్ర తదితరులు పేర్కొన్నారు.

ఆదివారం విశ్వకర్మ జయంతోత్సవాల సందర్భంగా ఉప్పల్ భగాయతులోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు. విశ్వకర్మ జయంతి ఉత్సవం ఉప్పల్ భగాయతులో పదివేల మందితో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఈ ఆత్మగౌరవ భవనాన్ని ఆధునిక దేవాలయంతో పోల్చారు. అట్టడుగున ఉన్న విశ్వకర్మీయులు ఉన్నత స్థానానికి ఎదగడం కోసం ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి ముందుకువచ్చి భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని చెప్పారు. విశ్వకర్మ జాతీయులకు రాజకీయాధికారాన్ని ఇవ్వడానికి కెసిఆర్ ముందుకు వచ్చారన్నారు.

సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మీయుల ప్రగతి వికాసాల కోసం ఈ విశ్వభ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం ఒక ఆలోచనా నిలయంగా మారాలని తెలిపారు. తెలంగాణలో నిర్మించబోయే ఈ ఆత్మగౌరవ భవనం దేశంలోని విశ్వకర్మీయులందరికీ ఒక జ్ఞానాలయంగా మారాలని చెప్పారు. బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాన్ని సాంకేతిక ఆలోచనలు అందించే ఒక రిసెర్చ్ సెంటరుగా రూపొందించి ఆ జాతి కోసం కృషి చేసేవిధంగా నిర్మించుకోవాలన్నారు. విశ్వకర్మ జాతి నుంచి వచ్చిన మేధావుల, ఆలోచనాపరులతో ఇది ఒక జ్ఞాన టార్చిలైటుగా వెలుగొందాలన్నారు. విశ్వకర్మ జాతి చైతన్యానికి ఈ భవనం ప్రతీకగా వెలుగొందాలన్నారు.

బిసికమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బహుజన గొంతుకగా ఉన్న దాసోజు శ్రవణ్ ను ఎంఎల్‌సి గా నియమించినందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. బహుజన జాతుల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్ కుమార్ ఎంఎల్‌సి ఫైలును గవర్నర్ వెంటనే ఆమోదించి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిసి కమీషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వకర్మీయులకు రాజకీయ ప్రాతినిథ్యం, ఛైర్మన్ పదవులు ఇచ్చి విశ్వకర్మ జాతికి ముఖ్యమంత్రి సముచితస్థానం కల్పించారని తెలిపారు. ఈ సభకు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్టు చైర్మన్ లాల్ కోట వెంకటాచారి అధ్యక్షత వహించగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్టు కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్, విశ్వకర్మ యజ్ఞం కమిటీ చైర్మన్ బలవంతాచారి, రామడుగు నరసింహాచారి, దానకర్ణాచారి, సుంకోజు కృష్ణమాచారి, కుందారం గణేష్ చారీ, రాఘవ చారీ, లక్ష్మి రామా చారీ, దుబ్బాక కిషన్ రావు, ఎర్రోజు వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News