మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 17న విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తగా 33 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి ఉత్సవ పండుగను అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని చెప్పారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, జిల్లా బిసి సంక్షేమాధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
హైదరాబాదులో ఉప్పల్ భగాయత్ లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం, వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో వేలాది మంది విశ్వకర్మీయులు పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను సచివాలయంలోని తన కార్యాలయంలో బుర్రావెంకటేశం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి నామోజు బాలాచారి, భవన ట్రస్టు ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్ లు పాల్గొన్నారు.