Sunday, December 22, 2024

విస్తారా విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ప్యారిస్ నుంచి ముంబై బయలు దేరిన విస్తారా ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. విమానం లోని ప్రయాణికులను దింపివేసి, విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే విమానంలో బాంబు ఆనవాళ్లు లేక పోవడంతో విమానయాన సిబ్బందితోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 302 మంది ప్రయాణికులు , సిబ్బందితో ప్యారిస్ నుంచి ముంబైకి విమానం బయలుదేరింది. కొన్ని గంటల తరువాత విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానం లోని సిబ్బంది అప్రమత్తమైంది.

ఆ కొద్ది సేపటికి ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని దించేశారు. ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌వేస్ స్పందించింది. ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది రక్షణ, భద్రత తమకు అత్యంత ముఖ్యమంతి ఈ సందర్భంగా ప్రకటించింది. జూన్ 1న చెన్నై నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రాగా, ముంబై ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దించివేయడం, తనిఖీలో నకిలీ బాంబు బెదిరింపు అని తేలడం తెలిసిందే. మే 28న కూడా ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి నకిలీ బెదిరింపు వచ్చింది. ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News