Wednesday, January 22, 2025

జర్నలిస్టులకు రక్షణ కరువు

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల మధ్య నేడు జర్నలిస్టులు తమ విధులను నిర్వహించాల్సి వస్తున్నది. వారికి రక్షణ కల్పించవలసిన వ్యవస్థలే వారి పట్ల కరకుగా వ్యవహరిస్తున్నాయి. మీడియా సిబ్బందిపై జరిగిన దాడులలో 42 శాతం దాడులను చట్టాన్ని అమలు చేసే సంస్థలే చేశాయని తాజాగా ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ దాడుల బాధితులలో 28 శాతం మంది జర్నలిస్టులు మహిళలు కావడం గమనార్హం. చివరకు హత్యలకు గురవుతున్న జర్నలిస్టుల కేసుల విషయంలో కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే, పూర్తిగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, బాధ్యులను విచారించడం ప్రభుత్వాల బాధ్యత.

పలు అంతర్జాతీయ, ప్రాంతీయ మానవ హక్కుల సాధనాలు, అలాగే అనేక ఐక్యరాజ్య సమితి ప్రోటోకాల్స్, తీర్మానాలు జాతీయ ప్రభుత్వాలపై గల ఇటువంటి బాధ్యతలను స్పష్టం చేస్తున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రభుత్వాలు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించాలని కోరుతున్నాయి. గత నవంబర్ 2022లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రతినిధులు వియన్నాలో సమావేశమై జర్నలిస్టుల భద్రతను కాపాడేందుకు తమ కట్టుబాట్లను బహిరంగంగా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపై జరుగుతున్న నేరాలకు శిక్షలు లేకుండా ఉండే పరిస్థితులను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. జర్నలిస్టుల భద్రత, శిక్షార్హత సమస్యపై ఐక్యరాజ్య సమితి కార్యాచరణ ప్రణాళిక 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. అయినా పరిస్థితులలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
ప్రస్తుతం గాజా, ఉక్రెయిన్, హైతీ, ఇథియోపియా, సహేల్, యెమెన్‌లతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఘర్షణలు, సాయుధ తిరుగుబాట్లు చెలరేగుతున్నందున జర్నలిస్టుల విధి నిర్వహణ పెను సవాళ్ళతో కూడుకొంటున్నది.

వారిపై జరిగే నేరాలను పరిశోధించే ప్రభుత్వ బాధ్యత ఇటువంటి ప్రాంతాలలో అదృశ్యం అవుతున్నది. సాయుధ సంఘర్షణ పరిస్థితులలో జర్నలిస్టులు, మీడియా ఉద్యోగుల భద్రతను కాపాడేందుకు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం చట్టబద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సి ఉంది. సాయుధ సంఘర్షణ సమయంలో జర్నలిస్టుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించి దర్యాప్తు జరపాల్సి వున్నప్పటికీ ఆ విధంగా జరగడం లేదు. తాజాగా కమిటీ టు జర్నలిస్ట్స్ (సిపిజె) విడుదల చేసిన నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో 263 జర్నలిస్టులకు సంబంధించిన హత్యలలో 80 శాతం కేసులలో న్యాయం జరగనే లేదు. అంటే వారి హత్యలకు బాధ్యులైన వారిని చట్టం ముందు దోషులుగా తేల్చే ప్రయత్నం జరగలేదు. ‘జర్నలిస్టు హత్యలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, నిరంకుశ వ్యవస్థలు గల దేశాలలో దాదాపు 80 శాతం కేసులలో శిక్షలు విధించకపోవడంలో సందేశం స్పష్టంగా ఉంది. జర్నలిస్టులు రాజకీయ క్రీడలకు బలవుతున్నారు’ అని సిపిజె అధ్యక్షుడు జోడీ గిన్స్‌బర్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.

హత్య అనేది సెన్సార్ షిప్‌కు అంతిమ రూపం. వేగవంతమైన, పారదర్శకమైన, స్వతంత్ర స్థానిక దర్యాప్తులు కీలకమైనవి. రాజకీయ సంకల్పం ఉంటే గాని తమ వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో హత్యకు గురవుతున్న జర్నలిస్టుల కేసులలో విస్తృతమైన శిక్షార్హతను నిరోధిస్తున్న న్యాయ మార్గాన్ని మార్చగలదు’ అని తెలిపారు. చివరకు ఎన్నికల సమయంలో నిర్భయంగా వార్తా కథనాలు ప్రచురించకుండా నిరోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఎన్నికల సమయంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి యునెస్కో రూపొందించిన నివేదిక ప్రకారం 2019 నుండి 2022 జూన్ వరకూ 70 దేశాల్లో 89 దాడులు జరిగాయి. ఎన్నికల సందర్భంగా అనేక మంది పాత్రికేయులను నిర్బంధించడం జరుగుతుంది.
అయితే కొందరిని తాత్కాలికంగా అరెస్ట్ చేయడం,

మరి కొందరిపై మోపిన ఆరోపణల్ని ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం జరుగుతున్నది.నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వార్తలను అందించే సమయంలో చాలా మంది పాత్రికేయులు అరెస్ట్‌లకు గురవుతున్నారు. నవంబర్ 2న ‘జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు శిక్షార్హత లేని అంతర్జాతీయ దినోత్సవం’ సందర్భంగా సిపిజె విడుదల చేసిన ‘శిక్షలు లేని సూచిక’ ఇటువంటి ధోరణులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నట్లు వెల్లడి చేస్తుంది. సోమాలియా, ఇరాక్, మెక్సికో, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, భారత దేశంలలో ఈ సూచిక ప్రారంభించిన 2008 నుండి ప్రతి ఏడాది ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండటం గమనార్హం. సిరియా, దక్షిణ సూడాన్, అఫ్ఘానిస్తాన్, బ్రెజిల్ లలో కూడా నిరంతర ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.

నిర్భయంగా వార్తాకథనాలు రాసిన పాత్రికేయుల పట్ల ప్రతీకారంతో వ్యవహరిస్తూ హత్యలకు గురైన వారి కేసుల విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని ఈ సూచిక స్పష్టం చేస్తుంది. సిపిజె దృష్టికి వచ్చిన పాత్రికేయుల హత్యలకు సంబంధించిన ఘటనలలో 1992 నుండి నేరస్థులను దోషులుగా నిర్ధారించబడటం కేవలం 47 మంది జర్నలిస్టుల విషయంలోనే జరిగిన్నట్లు కనుగొన్నారు. అంటే వారి దృష్టికి వచ్చిన కేసులలో 5 శాతం కన్నా తక్కువ కేసులలోనే నేర విచారణ క్రమబద్ధంగా జరుగుతున్నట్లు తేలుతుంది. ఆయా దేశాల అంతర్గత రాజకీయాలు, అంతర్జాతీయ ఒత్తిడిలో మార్పులు జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని సిపిజె భావిస్తున్నది. 1988లో హత్యకు గురైన పెరువియన్ జర్నలిస్ట్ హ్యూగో బుస్టియోస్ సావేద్రా విషయంలో ఇదే జరిగింది. పెరూ మాజీ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు అతని హత్యకు పాల్పడినందుకు శిక్ష పడేందుకు దాదాపు 35 ఏళ్లు పట్టింది.

జెనీవాకు చెందిన ది ప్రెస్ ఎంబ్లమ్ క్యాంపెయిన్ (పిఇసి) ఇజ్రాయెల్ -హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలో చాలా మంది జర్నలిస్టులు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించి స్వతంత్ర దర్యాప్తులు జరిపేందుకు ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ పిలుపిచ్చింది. 2023 ప్రారంభం నుండి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 74 మంది జర్నలిస్టులు దాడులు, బాంబు దాడులు లేదా లక్ష్యంగా చేసుకున్న హత్యలలో మరణించారని తెలిపింది. ఈ సంవత్సరం అక్టోబరులో 36 మంది జర్నలిస్టులు మరణించారు. వారిలో 33 మంది ఇజ్రాయెల్, -హమాస్ (గాజాలో 28 పాలస్తీనియన్లు, 4 ఇజ్రాయెలీలు, 1 లెబనాన్‌లో) ఘర్షణలో మరణించిన వారి. ‘ఇవి స్పష్టంగా యుద్ధ నేరాలు. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నందున మీడియాపై అసాధారణమైన దాడిగా పరిగణించాల్సిందే’ అని పిఇసి అధ్యక్షుడు బ్లేజ్ లెంపెన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News