Sunday, January 19, 2025

వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!

- Advertisement -
- Advertisement -

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్రావధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘ్ పరివార్ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్ద మనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ ఆయన మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ 5లో ప్రసారం కానుంది.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం జరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్ అగ్నిహోత్రి ఒక సంఘ్ పరివార్ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్ద మనిషి కూడా అనుసరించి తన నిబద్ధతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహోత్రి ట్విటర్ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కశ్మీర్ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయ వ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా, నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కశ్మీర్ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమవుతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందనను ఎందుకు వెల్లడించలేదు ?

అంతకు ముందు వివేక్ అగ్నిహోత్రి మణిపూర్ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్‌లో ఇలా ఉంది. “మణిపూర్: మోప్లా, డైరెక్ట్ యాక్షన్ డే (ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లిం లీగ్ నేత జిన్నా అదే ఏడాది జులైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్, పంజాబ్, కశ్మీర్, బెంగాల్, కేరళ, అసోం, బస్తర్ ఇప్పుడు మణిపూర్… ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష, ఆటవిక చర్యలకు బలవుతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్ద మనిషి కవితా స్పందన గురించి చూద్దాం. “ఓ మణిపూర్… నేను యత్నించా… నేను యత్నించా… కానీ విఫలమయ్యా… నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాథలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలస్యం అవుతుంది… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీతత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…

మనమందరం మత అతి బాధితులం… మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం… మనం భారత పౌరులం, బాధితులం… స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం… ఇది నేను కోరుకున్న స్వేచ్ఛ కాదు… ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్థమే లేదు… మనది ఒక విఫల సమాజం… నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను… నా తల్లులారా నేను విచారిస్తున్నాను… భారత మాతా నేను విచారిస్తున్నాను” ఇలా సాగింది ఆ కవిత. అతిశయోక్తులతో కూడిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్‌ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు? మణిపూర్ గురించి తాను సినిమా తీసేసరికి ఎంతో ఆలస్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్ద మనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు “ఎంపిక” చేసుకున్నట్లు? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు.

ఇప్పుడు 49 సంవత్సరాల పరిణతి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారత మాత ఫైల్స్ ఎందుకు తీయలేదు? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్ ఫైల్స్‌కు అంత సీన్ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కశ్మీర్ ఫైల్స్ మాదిరి సంఘ్ పరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా? లేక అన్నింటికీమించి అక్కడ అసలు కారకులు సంఘ్ పరివారం అని చెప్పాల్సి వస్తుందనా? బేటీ బచావో అని చెప్పిన పెద్ద మనిషి మణిపూర్ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఫైల్స్‌ను విప్పాల్సి ఉంటుందనా ?

గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలోకి నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాథ్ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్ కక్కర్ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి మణిపూర్ ఫైల్స్ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం. మణిపూర్ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘ్ పరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్ మార్క్స్, ఎంగెల్స్ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్ అగ్నిహోత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.

గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్తదనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమైన పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్ ఖక్కర్ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్ అగ్నిహోత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం. అనువాదం : రాఘవశర్మ

శవ వాహిని గంగ భయపడకు.. ఆనందపడిపో… ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి… ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం… ఓ రాజా.. అడవి అంతా బూడిదయ్యింది, ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,… ఓ రాజా.. బతికించే వాళ్ళు లేరు,… శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,… ధుఃఖితులు మాత్రం మిగిలారు… అంతా కోల్పోయి మిగిలాం… మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది… ఓ రాజా.. కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్ మమ్మల్ని కబళించేస్తోంది… ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హృదయాలు ముక్కలయ్యాయి…

అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది… బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి… రాజా.. నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది… ఓ రాజా.. నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు… ఓ రాజా.. ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి… ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,… రా.. బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,… దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు… ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు… కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి.., ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహోత్రికి, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్ సిఎం బీరేన్ సింగ్‌కూ తేడా ఏముంది? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది.

ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్‌కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీరుతెన్నుల నేపథ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది. సంఘ పరివార్ నీడలో జీవిస్తున్న వివేక్ అగ్నిహోత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పని లేదు. నేను భగ రంధ్రాన్ని… నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు… లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు… లేదా ఏ సంస్కృతినీ మోసేదాన్ని కాదు… లేదా పవిత్రత వైపు నడిపించే మార్గాన్ని కాదు… లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు… లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు… లేదా రక్త ప్రవాహాన్ని కాదు… లేదా స్త్రీత్వ సారాన్ని కాదు… కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు… కానీ… ఆమె కోరుకుంటే… తరువాత… నేను … ఒక నవ సృష్టికి సారధిని అవుతా !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News