ఎంఎక్స్ ఒరిజినల్ సిరీస్ ‘ధారావీ బ్యాంక్’. ధారావీ గోడల మధ్య విస్తరించిన నేర సామ్రాజ్యపు శక్తివంతమైన కథ ఇది. ఉద్విగ్నభరితంగా సాగే కథనం కూడా తోడు కావడంతో ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ ఇప్పటికే వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సిరీస్‌లో 30వేల కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన ఆర్ధిక నేరసామ్రాజ్య మూలాలను అన్వేషించే ఓ అవిశ్రాంత పోలీస్ ప్రయత్నం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటుంది.
వైవిధ్యమైన నటుడు వివేక్ ఆనంద్ ఒబెరాయ్, ఈ ‘ధారావీ బ్యాంక్’ సిరీస్‌లో పవర్‌ఫుల్ జెసెపీ జయంత్ గవాస్కర్‌గా జీవించారు. రూల్‌బుక్‌కు కట్టుబడి ఉండాల్సిన పనిలేదంటూ తనకు అనుకూలమైన రీతిలో నిబంధనలను మార్చుకునే తత్త్వమున్న పోలీస్‌గా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జయంత్ గవాస్కర్‌గా వీక్షకులను ఆకట్టుకోవడం పట్ల తన సంతోషాన్ని వెల్లడించిన వివేక్, ‘ధారావీ బ్యాంక్’ మరియు తన తొలి చిత్రం ‘కంపెనీ’ నడుమ సంబంధం వివరించారు. ‘ధారావీ బ్యాంక్’లో తాను చేసిన జెసీపీ జయంత్ గవాస్కర్ పాత్ర కోసం ‘కంపెనీ’లో ముంబై పొలీస్ జాయింట్ కమిషనర్‌గా మోహన్‌లాల్ పోషించిన వీరపల్లి శ్రీనివాసన్, ఐపీఎస్ పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నానని, దాని కోసం ఆ సినిమాను పదే పదే చూశానన్నారు.
వివేక్ మాట్లాడుతూ ‘‘జీవితాంతం హృదయంలో నిలిచిపోయే కొన్ని ఉంటాయి. కంపెనీ నా తొలి చిత్రమే అయినప్పటికీ దానిలో నేర్చుకునేందుకు ఎంతో ఉంది. అద్భుతమైన నటులు అజయ్‌దేవగన్, మోహన్‌లాల్ వంటి నటులు దానిలో ఉన్నారు. ధారావీ బ్యాంక్ కోసం నేను మోహన్‌లాల్ సర్ నటనా చాతుర్యం పరిశీలించడానికి పదే పదే ఆ సినిమా చూశాను. ఆయన దానిలో ముంబై పొలీస్ జాయింట్ కమిషనర్ వీరపల్లి శ్రీనివాసన్, ఐపీఎస్ గా చేశారు. తన సీన్స్ అద్భుతంగా రావడం కోసం ఆయన అనుసరించే విధానం నాకిప్పటికీ గుర్తే’’ అని అన్నారు.
మోహన్‌లాల్ పట్ల తన గౌరవాన్ని వివేక్ వెల్లడిస్తూ.. ‘‘అనుభవంతో కూడిన టెక్నిక్ ఆయనది. ఆయన పాత్రలో అవలీలగా ఒదిగిపోతారు. ఆయన ఆ క్యారెక్టర్‌కు ఆయన సిద్ధమయ్యే తీరు స్ఫూర్తిదాయకం. ఈ క్యారెక్టర్ కోసం నేను ఆయన ఉపయోగించిన కొన్ని ట్రిక్స్ చేశాను. దానితో పాటుగా ముంబైలో ఎంతోమంది పోలీసులతో నాకున్న పరిచయాలు, వారి మార్గనిర్థేశనం ఈ క్యారెక్టర్ గొప్పగా రావడానికి తోడ్పడింది’’ అని అన్నారు. జయంత్ గవాస్కర్‌గా తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ గురించి చెబుతూ ‘‘మనం చేసే నటన వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లుగా ఉండటం, మోహన్‌లాల్ సర్ లాగా నేను చేయగలిగానని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.