పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బిజెపి నేత, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వివేక్ కూడా బిజెపిని వీడబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.
బిజెపి ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో కూడా ఆయన పేరు లేకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి తన రాజీనామా ప్రచారంపై స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని, తాను బిజెపిలోనే ఉంటానని ఉంటానని స్పష్టం చేశారు. తనపై కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై వివేక్ స్పందిస్తూ.. ఆయన రాజీనామా గురించి తనకు తెలియదని చెప్పారు. మరోవైపు డికె అరుణ, విజయశాంతిలు కూడా పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
Also Read: టీషాపు నడుపుతున్న తలైవా: అభిమానులు షాక్(వైరల్ వీడియో)