Thursday, January 23, 2025

శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ హైస్పీడ్ రైల్వేలైన్

- Advertisement -
- Advertisement -

లైన్ కోసం ‘పెట్’ సర్వేకు అనుమతించిన రైల్వే బోర్డు
ఆరునెలల్లో నివేదిక అందించనున్న కాంట్రాక్టర్

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసిందని దక్షిణమధ్య రైల్వే అధికారిక వర్గాల సమాచారం. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి కాంట్రాక్టర్ ఆరు నెలల్లో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైల్వే లైన్ అలైన్‌మెంట్ ప్రాథమికంగా శంషాబాద్ నుంచి 65వ నంబర్ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ఈ లైన్ వేయనున్నారు. 220 కి.మీ. వేగంతో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపే విధంగా ఈ లైన్ వేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైల్వే లైన్ వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల మీదుగా ఈ లైన్ వెళ్లనుంది. ఇప్పటికే డోర్నకల్-, మిర్యాలగూడ మార్గానికి సంబంధించి బ్రాడ్‌గేజ్ లైన్ సర్వే చివరి దశలో ఉంది. ఈ లైన్ డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. ఈ లైన్‌ను జాన్‌పహాడ్ వద్ద అనుసంధానం చేసే విధంగా రూపొందిస్తున్నారు.

296 కిలోమీటర్ల మేర మరో రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు
డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296 కిలోమీటర్లతో మరో రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది. దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్లతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ మార్గాలతో అదనపు అనుసంధానం ఏర్పడనుంది. దీనివల్ల వైటిపిఎస్ పవర్ ప్లాంట్ కు అవసరమయ్యే బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి సులభంగా రవాణా చేసే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ ధాన్య బండాగారానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు బియ్యం రవాణాకు ఎగుమతి చేసేందుకు ఎంతో ఉపయోగపడనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News