విశాఖపట్నం: ఇప్పటికిప్పుడు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని భావించడంలేదంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. విశాఖపట్నం పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫగ్గన్ సింగ్ కులస్తే మాట్లాడారు. ‘ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికైతే ముందుకు వెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పై విధంగా వ్యాఖ్యలు చేశారు.