కొవిడ్ నిబంధనలు పాటించకపోతే పెనుముప్పు
థర్డ్‌వేవ్ ప్రమాదంపై కేంద్ర హెచ్చరిక
ప్రస్తుతానికి దేశంలో థర్డ్‌వేవ్ సూచనలు లేవు
మున్ముందు దాపురించకుండా ఉండదు
ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలి- నీతి ఆయోగ్ సభ్యుడు వికెపాల్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయని, ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.9 లక్షల కేసులు నమోదవుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ మంగళవారం విలేఖరుల సమావేశంలో హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తూ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని అర్థమవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి భారత దేశంలో థర్డ్‌వేవ్ సూచనలు కనిపించలేదని, అయితే మున్ముందు ఇది మన దేశాన్ని తాకకుండా ఉండాలంటే ప్రజలంతా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన వైరస్ కథ ముగిసిందని భావించరాదని హెచ్చరించారు. ఇదే సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ తాము థర్డ్‌వేవ్ గురించి హెచ్చరిస్తూ ఉంటే కొందరు మాత్రం వాతావరణం అప్‌డేట్‌లాగా తేలిగ్గా తీసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వర్షాలు రాకముందే కొత్త ప్రాంతాలకు వెళ్లి వస్తామని అనుకొంటున్నారు. అయితే ఇది వైరస్‌కు, మనిషులకు మధ్య నిరంతంరం సాగే పోరాటం అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. వాతావరణంకంటే కూడా మన ప్రవర్తనే థర్డ్‌వేవ్‌కు కారణమవుతుంది. మనం కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించకపోతే భవిష్యత్తులో వచ్చే వేవ్‌లను అడ్డుకోలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పలు మార్కెట్ ప్రాంతాలు, మనాలి, ముస్సోరిలాంటి హిల్ స్టేషన్లలో జనం మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా గుంపులు, గుంపులుగా తిరగడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇలాంటి ప్రవర్తనే వైరస్‌పై మనం ఇంతకాలం చేసిన పోరును నీరు గారుస్తుందని హెచ్చరించారు.
హిల్ స్టేషన్లలో గుంపులు ఆందోళనకరం
ఈశాన్య రాష్ట్రాల సిఎంలతో సమావేశంలో ప్రధాని మోడీ
కరోనా సెకండ్ వేవ్‌లాగా థర్డ్ వేవ్ కూడా విజృంభించకుండా నిలువరించాలంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే మనం మహమ్మారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా కరోనా మహమ్మారి వివిధ రూపాలను సంతరించుకుంటోందని, వాటిపై మనం ఓ కన్నేసి ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కరోనా వేరియంట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని,మనందరం కూడా కరోనా నిబంధనలు పాటించడంతో పాటుగా ప్రజలంతా వాటిని పాటించేలా ప్రోత్సహిద్దామని ఆయన ఈశాన్య రాష్ట్రాల సిఎంలకు సూచించారు.‘ కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాలు బాగా దెబ్బతిన్నాయనేది నిజమే. అయితే హిల్ స్టేషన్లు, మార్కెట్లలో జనం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరగడం ఆందోళన కలిగించే విషయం. ఏ విధంగాను సమర్థనీయం కాదు, అని ప్రధాని అన్నారు.ప్రజలు తు.చ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ఆయన సిఎంలకు సూచించారు.
VK Paul press meet on Corona third Wave